అనూ బేబీకి ఈసారైనా సక్సెస్ దక్కుతుందా?

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఆశించిన సక్సెస్ అందలేదు.

Update: 2024-10-24 00:30 GMT

అవకాశాలు వచ్చినా, అదృష్టం కలిసి రాని అందాల భామల్లో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఆశించిన సక్సెస్ అందలేదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, రవితేజ, నాని, శర్వానంద్, కార్తీ, శివ కార్తికేయన్ లాంటి స్టార్స్ సరసన నటించినా.. స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది. 'జపాన్' ఫ్లాప్ తర్వాత మళ్ళీ ఎక్కడా కనిపించని అనూ బేబీ.. ఎట్టకేలకు తెలుగులో మరో ఆఫర్ దక్కించుకుంది.

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఐ.ఆండ్రు బాబు డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ.. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేసి, సినిమాకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు.

ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా రెండు ప్యారలల్ స్టోరీ లైన్స్ తో ఈ థ్రిల్లర్ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. కర్మ సిద్ధాంతం ఇతివృత్తాలను అన్వేషించే ఈ చిత్రం ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. డైరెక్టర్ ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేస్తున్నారు. మై3 ఆర్ట్స్, బిగ్ మూవీ మేకర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.

ఇకపోతే అను ఇమ్మాన్యుయేల్ 'యాక్షన్ హీరో బిజు' అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. 2016లో 'మజ్ను' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీ హిట్టయినప్పటికీ ఆ తర్వాత వరుసగా పరాజయాలు పలకరించాయి. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'ఆక్సిజన్' 'అజ్ఞాతవాసి', 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా', 'శైలజా రెడ్డి అల్లుడు', 'మహాసముద్రం', 'అల్లుడు అదుర్స్', 'ఊర్వశివో రాక్షసివో', 'రావణాసుర' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.

తమిళ్ లో అను ఇమ్మాన్యుయేల్ నటించిన 'డిటెక్టివ్', 'నమ్మ వీట్టు పిళ్లై' సినిమాలు మాత్రం మంచి విజయాలు సాధించాయి. కానీ చివరగా వచ్చిన 'జపాన్' మూవీ డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఇది తెలుగులోనూ ఫ్లాప్ అవడంతో అమ్మడు ఆఫర్స్ కు దూరమైంది. ఇప్పుడు శివ కందుకూరి సినిమాలో నటించే అవకాశం అందుకుంది. మరి ఈ చిత్రం అనూ బేబీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

డైరెక్టర్ గా మారిన సినిమాటోగ్రాఫర్..

ఇక డీఓపీ ఐ ఆండ్రూ విషయానికొస్తే.. డార్లింగ్, ఒక లైలా కోసం, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఎందుకంటే ప్రేమంట, గుండెజారి గల్లంతయ్యిందే, తేజ్ ఐ లవ్ యు, కందిరీగ, మసాలా, చిన్నదానా నీకోసం, కౌసల్య కృష్ణమూర్తి, ఒరేయ్ బుజ్జిగా, డియర్ మేఘ, పవర్ ప్లే వంటి చిత్రాలకు ఆయన సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఈ క్రమంలో అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరిల సినిమాతో మెగా ఫోన్ పట్టుకొని దర్శకునిగా మారుతున్నారు.

Tags:    

Similar News