వాళ్ళలా ఎదిగేదెలా?
ఇండస్ట్రీలో ఔట్ సైడర్లు గొప్ప స్టార్లు గా ఎదిగేస్తుంటే అభిషేక్ బచ్చన్ ఇంకా ఇతరుల సినిమాల్లో సహాయకపాత్రల్లో నటిస్తున్నాడు.
పరిశ్రమలో తమదైన మార్క్ వేయడమే గాక, దశాబ్ధాల పాటు అగ్ర కథానాయకులుగా వెలిగిపోయిన పెద్ద స్టార్ల పుత్ర రత్నాలు సినీపరిశ్రమలోకి రావడం నిజంగా సవాల్ లాంటిది. నటవారసులు లెగసీని ముందుకు సాగించడంలో ఎక్కడ తడబడినా దానిని అభిమానులు అంత తేలిగ్గా తీసుకోరు. దీనికి అన్ని సినీపరిశ్రమల్లో ఉదాహరణలు కోకొల్లలు. లెజెండరీ అమితాబ్ బచ్చన్ నటవారసుడు అభిషేక్ బచ్చన్ పరిస్థితి ఏమిటో చూస్తున్నదే. ఇండస్ట్రీలో ఔట్ సైడర్లు గొప్ప స్టార్లు గా ఎదిగేస్తుంటే అభిషేక్ బచ్చన్ ఇంకా ఇతరుల సినిమాల్లో సహాయకపాత్రల్లో నటిస్తున్నాడు. ఇటీవల విలన్ పాత్రలు కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది.
ఇదిలా ఉంటే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటవారసుడు జునైద్ ఖాన్ పరిస్థితి ఏమిటి? అన్న చర్చా వేడెక్కిస్తోంది. తండ్రి పెద్ద స్టార్ కాబట్టి జునైద్ టనలోకి ప్రవేశించి ఉంటే అతడు నిలదొక్కుకోవడం కష్టమే. అతడు తన తొలి చిత్రం మహారాజాలో నటన పరంగా అంతగా ప్రభావం చూపలేదు. కానీ ఇంతలోనే రెండో సినిమాతో థియేటర్లలోకి వస్తున్నాడు. ఇప్పుడు శ్రీదేవి రెండో కుమర్తె ఖుషీ కపూర్ తో కలిసి `లవ్ ఇన్ ది డిజిటల్ ఎరా` చిత్రంలో నటిస్తున్నాడు. ఇది తమిళ బ్లాక్ బస్టర్ లవ్ టుడేకి రీమేక్ అన్న గుసగుసలు ఉన్నాయి. ఫాంటమ్ స్టూడియోస్ - AGS ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తారని ఫాంటమ్ స్టూడియోస్ పేర్కొంది. డిజిటల్ యుగంలో ప్రేమకథలో జునైద్ ఏమేరకు రాణిస్తాడు? అన్న చర్చా వేడెక్కిస్తోంది. ఇక తన తొలి వెబ్ సిరీస్ ది ఆర్చీస్ లో ఆశించినంత ప్రభావం చూపని ఖుషీ కపూర్ ఇప్పుడు తన తొలి బిగ్ స్క్రీన్ ఎంట్రీలో ఎలా నటించనుందో చూడాల్సి ఉంటుంది. 7 ఫిబ్రవరి 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతుండగా, జునైద్ ఎంపికల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
అద్వైత్ చందన్ గతంలో జునైద్ తండ్రి అమీర్ ఖాన్‌తో కలిసి `లాల్ సింగ్ చద్దా` లాంటి డిజాస్టర్ చిత్రానికి పని చేసాడు. అతడు జునైద్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీని ప్రభావం ఇప్పుడు జునైద్ సినిమాపైనా పడుతుందనే సందేహాలున్నాయి. అమీర్ ఖాన్ తన కెరీర్ లో ఒరిజినల్ కథలతో పాటు రీమేక్ కథల్లోను నటించాడు. అతడు `గజిని` రీమేక్ లో నటించి కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. కానీ చాలా ఒరిజినల్ కథల్లో నటించి అంతకుమించిన సంచలనాలు సృష్టించాడు. ఇండస్ట్రీ హిట్లతో రికార్డులు బ్రేక్ చేసాడు. అయితే అమీర్ ఖాన్ మేనియాను క్రియేట్ చేయడం ఎవరి వల్లా కావడం లేదు. ఇప్పుడు నటవారసుడు జునైద్ తో సాధ్యమా? అన్న చర్చా సాగుతోంది. అతడు కెరీర్ ఆరంభమే ఇలా రీమేక్ లో నటించడం సవాళ్లతో కూడుకున్నది. బాలీవుడ్ హీరోల కథల సెలక్షన్ పై చాలా విమర్శలు ఉన్న ఇలాంటి సమయంలో నటవారసుడు జునైద్ తెలివిగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుందని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.