జేక్స్ బిజోయ్.. సుడి తిరుగుతుందా?
నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ మంచి టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
"జేక్స్ బిజోయ్.. సినిమా అంతా హీరో ఇంట్రోకి ఇచ్చినట్లు మ్యూజిక్ ఇచ్చారు. రేసీ మూవీ కాబట్టి నాకు ఆయన వర్క్ పై ఫుల్ క్యూరియాసిటీ ఉంది. అందుకే నేను స్వయంగా వెళ్లి BGM వర్క్ చూశా. ఆగస్టు 29వ తేదీన ఆయన వర్క్ అండ్ టాలెంట్ మీరు చూడండి.." ఇవి టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు! ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యాక నాని చెప్పిన మాటలు అక్షరాల నిజమేనని అంతా చెబుతున్నారు.
నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ మంచి టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నాని యాక్షన్ తోపాటు వివేక్ ఆత్రేయ వర్క్ కు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మూవీ టీమ్ సక్సెస్ మూడ్ లో ఉంది. అయితే మాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ తో సరిపోదా శనివారం సినిమాపై బలమైన ప్రభావాన్ని చూపించారని చెప్పడంలో ఎవరికీ ఎలాంటి డౌట్ అకర్లేదు.
మూవీ హిట్ అవ్వడానికి ఉన్న కారణాల్లో జేక్స్ బిజోయ్ వర్క్ కూడా పక్కా ఉంటుంది. గ్రిప్పింగ్ ఎలివేషన్స్ ఇచ్చే సమయంలో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ లో ఉందని సినీ ప్రియులు చెబుతున్నారు. కమర్షియల్ పాన్ ఇండియా చిత్రాలకు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో తన వర్క్ ఓ రేంజ్ లో ఉంటుందని మరోసారి నిరూపించుకున్నారు. దీంతో మ్యూజిక్ లవర్స్ తోపాటు సినీ క్రిటిక్స్ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
అయితే విడుదలకు ముందే సరిపోదా శనివారం పాటలను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అవి అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరించకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ మెప్పిస్తోంది.. అలరిస్తోంది... ప్రశంసించేలా చేస్తోంది. దీంతో ఆయన వర్క్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. బడా హీరోల సినిమాల్లో జేక్స్ బిజోయ్.. అవకాశాలు అందుకునే సూచనలు కనిపిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. తమన్, దేవి శ్రీ ప్రసాద్ ముఖ్యంగా కనిపిస్తున్నారు. సంగీత దర్శకులు సంతోష్ నారాయణ్, అనిరుధ్ రవిచందర్ టాలీవుడ్ పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో జేక్స్.. బడా ప్రాజెక్టుల మేకర్స్ దృష్టిలో పడితే ఆయన సుడి తిరగడం ఖాయం! మరి ఆయన ఫ్యూచర్ లో ఎలాంటి ఛాన్సెస్ అందుకుంటారో? తన వర్క్ తో ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.