ఈ వారం ఆ రెండు చిన్న సినిమాలదే హవా!

దీపావళికి ముందు అనేక చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అయ్యాయి.

Update: 2024-10-24 12:43 GMT

దసరా సీజన్ ను క్యాష్ చేసుకొని 'దేవర' చిత్రం మంచి విజయం సాధించింది. దీని తర్వాత తెలుగులో పెద్ద సినిమాలేవీ విడుదల కాలేదు. ఈ గ్యాప్ ని చిన్నా చితక చిత్రాలు పూర్తి చేస్తున్నాయి. దీపావళికి ముందు అనేక చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అయ్యాయి. ఈ శుక్రవారం ఏకంగా అర డజను మూవీస్ రాబోతున్నాయి. వాటిల్లో కంటెంట్ ను నమ్ముకుని వస్తున్న మూడు సినిమాలు, రిలీజ్ కు ముందే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాయి. ఆ చిత్రాలే పొట్టేల్, లగ్గం, నరుడి బ్రతుకు నటన.

యువ చంద్ర, అనన్య నాగళ్ల, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ''పొట్టేల్''. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 80వ దశకంలో తెలంగాణా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, చదువు ప్రాముఖ్యతను తెలియజెప్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ ట్రైలర్‌కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. గత కొన్ని రోజులుగా చిత్ర బృందం బాగా దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే బుధవారం రాత్రి ప్రదర్శించిన స్పెషల్ ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

'పొట్టేల్' అనేది ఒక పవర్ ఫుల్, రూరల్ ఎమోషనల్ డ్రామా అని ప్రీమియర్స్ టాక్ ని బట్టి తెలుస్తోంది. విద్య సాధికారత, తండ్రీ కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. అజయ్, యువ చంద్ర, అనన్య నాగళ్ల తమ పాత్రల్లో టెర్రిఫిక్ గా నటించినట్లు చెబుతున్నారు. గురువారం కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ & ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌ బ్యానర్స్ పై రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తోంది.

మరోవైపు తెలంగాణ నేపథ్యంలో పెళ్లి కాన్సెప్ట్ మీద తీసిన ''లగ్గం'' సినిమా ఈ వారమే రిలీజ్ అవుతోంది. సాఫ్ట్ వేర్ సంబంధాలు, వ్యవసాయం వంటి అంశాలతో ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి రోనక్, ప్రగ్యా, రాజేంద్ర ప్రసాద్, రోహిణి ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇది 'బలగం' తరహాలో ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇక ''నరుడి బ్రతుకు నటన'' అనే మరో చిన్న సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇందులో శివ కుమార్, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటికే ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో స్పెషల్ స్క్రీనింగ్ చేయబడింది. ఈ మధ్య వచ్చిన ట్రైలర్ బాగానే ఉంది.

ఈ వారం రిలీజయ్యే సినిమాల్లో ఈ మూడు మాత్రమే జనాల దృష్టిని ఆకర్షించాయి. వాటిల్లోనూ 'పొట్టేల్', 'లగ్గం' చిత్రాలకు మంచి బజ్ ఉంది. కంటెంట్ బాగుండి మంచి మౌత్ టాక్ తెచ్చుకుంటే, ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా పెరఫార్మ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ చిత్రాల్లో ఏవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.

Tags:    

Similar News