చిరు 'గాడ్‌ఫాదర్ -2' చేస్తారా?
అయితే లూసీఫర్ సీక్వెల్ గా వస్తున్న 'ఎల్ 2 ఎంపూరన్' రీమేక్ రైట్స్ ని నిర్మాతలు వేరొకరికి ముట్టజెబుతారా లేదా? అనేదానిపై క్లారిటీ లేదు.
మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన లూసీఫర్ ఘనవిజయం సాధించినా కానీ, ఇక్కడ 'గాడ్ ఫాదర్' ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ సినిమా ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా తెలుగులో రీమేక్ చేసినా పెద్దగా ఆడలేదు.
ఇక లూసీఫర్ సీక్వెల్ ని దర్శకనటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల ప్రకటించారు. మోహన్ లాల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా అద్భుత స్పందన వచ్చింది. మరోసారి లాల్ సిసలైన డాన్ పాత్రలో కనిపించనున్నారని పోస్టర్ వెల్లడించింది. లూసీఫర్ కథాంశం ఆసక్తికరం. స్వదేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించే సవతి సోదరి పాత్ర.. విదేశాల్లో డాన్ పాత్ర (మోహన్ లాల్) పార్ట్ 1లో ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తాయి. ఇప్పుడు అవే పాత్రలకు కొనసాగింపుతో ఎల్2 ఎంపూరన్ ని పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో అతడు అతిథి పాత్రలో నటించే వీలుంది.
ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తారా? అంటూ అభిమానుల్లో చర్చ సాగుతోంది. అయితే లూసీఫర్ సీక్వెల్ గా వస్తున్న 'ఎల్ 2 ఎంపూరన్' రీమేక్ రైట్స్ ని నిర్మాతలు వేరొకరికి ముట్టజెబుతారా లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. ఇక 'ఎల్ 2 ఎంపూరన్' చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు-తమిళం-హిందీలోను రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అంటే ఇది పాన్ ఇండియన్ సినిమా కాబట్టి దీనికి రీమేక్ పని చేయదని కూడా భావించాల్సి ఉంటుంది. అయినా రీమేక్ లతో ఆశించినదేదీ జరగడం లేదు గనుక చిరు కూడా ఎంపూరన్ విషయంలో సాహసాలు చేయరనే భావిస్తున్నారు.