ప్రపంచంలో అత్యంత అందమైన నటుడు?
అందంపై పరిశోధకుడు, ప్రముఖ సర్జన్.. డా. జూలియన్ డి సిల్వా చేసిన శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 అత్యంత అందమైన నటులలో షారుఖ్ ఖాన్ స్థానం పొందాడు.
ముఖం చెక్కేసినట్టు ఉన్నా కొందరి ఆహార్యం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కొందరు ఎంత అందంగా కనిపించినా కానీ, ఆ ముఖంలో ఏదో కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. అలా కాకుండా అందం ఆహార్యం సమపాళ్లలో కలగలుపుతో ఎవరైనా మీ చుట్టూ ఉన్నారా? అలాంటి వారిలో వందశాతం ముఖ పరిపూర్ణత ఉన్నవారిని కనిపెట్టగలరా?
అయితే ఇప్పుడు 'ముఖ పరిపూర్ణత'పై శాస్త్రీయ అధ్యయనంలో ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అందమైన నటుల జాబితా విడుదల అయింది. అందులో భారతదేశం నుంచి ఏకైక స్టార్ గా షారూఖ్ ఖాన్ స్థానం సంపాదించుకున్నారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, ప్రభాస్, మహేష్ వంటి ఇస్మార్ట్ హీరోలకు దక్కని స్థానం షారూఖ్‌కి దక్కింది. ఇది నిజంగా చెప్పుకోదగ్గ విషయం.
అందంపై పరిశోధకుడు, ప్రముఖ సర్జన్.. డా. జూలియన్ డి సిల్వా చేసిన శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 అత్యంత అందమైన నటులలో షారుఖ్ ఖాన్ స్థానం పొందాడు. 'గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై'ని ఉపయోగించి, ఖాన్ 86.76 శాతం ముఖ సమరూపతను సాధించి 10వ స్థానంలో నిలిచాడు. టాప్ 10లో ప్రవేశించిన వారిలో ఆరోన్ టేలర్-జాన్సన్ 93.04 శాతంతో నంబర్ వన్ గా నిలిచాడు. బాట్‌మాన్ స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్, 'గ్లాడియేటర్ II' నటుడు పాల్ మెస్కల్ మొదటి ఐదు ర్యాంకుల్లో ఉన్నారు.
షారూఖ్ ఖాన్ అత్యంత అందమైన నటులలో ఒకరిగా పరిగణించాలని చెప్పేది కేవలం అభిమానులే కాదు, సైన్స్ కూడా దీనిని సమర్థిస్తుందని ఇప్పుడు నిరూపణ అయింది. అతడి ముఖాకృతి అంత అందంగా ఉండదని విమర్శించిన కొందరికి ఇది చెంప పెట్టు లాంటిది. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డిసిల్వా నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనం ప్రకారం షారూఖ్ టాప్ 10 అత్యంత అందమైన మగ నటులలో ఒకరిగా స్థానం పొందారు. 2024 టాప్ 10 అత్యంత అందమైన నటీనటుల జాబితాలో 2023 ర్యాంకింగ్స్ నుండి తిరిగి చేరిన స్టార్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. తన గ్లోబల్ అప్పీల్‌ని మరోసారి ధృవీకరిస్తూ జాబితాలో చేరిన ఏకైక భారతీయ నటుడు షారుఖ్ ఖాన్. సూపర్ స్టార్ షారూఖ్ కి 86.76 శాతం ఆకట్టుకునే ముఖ సౌష్టవ స్కోర్ దక్కడంతో 10వ స్థానంలో నిలిచారు. జాబితాలోని అనేక మంది నటులు SRK కంటే ఎక్కువ ర్యాంక్ పొందిన వారిలో నెక్ట్స్ తీయబోయే జేమ్స్ బాండ్ పాత్రకు పోటీదారులుగా ఉన్నారు.
87.94 శాతం ముఖ సమరూపత స్కోర్‌తో 9వ స్థానంలో నిలిచిన బ్రిటీష్ నటుడు ఇద్రిస్ ఎల్బా బాండ్ గా నటించేందుకు పోటీబరిలో ఉన్నారు. జాబితాలో 'రివర్‌డేల్' స్టార్ చార్లెస్ మెల్టన్ 88.46 శాతం ముఖ సమరూపతతో 8వ స్థానంలో ఉన్నారు. నికోలస్ హౌల్ట్ 89.84 శాతంతో 7వ స్థానంలో ఉన్నారు. హాలీవుడ్ లెజెండ్ జార్జ్ క్లూనీ 89.9 శాతం సమరూపతతో 6వ స్థానంలో నిలిచాడు. 90.33 శాతం స్కోర్‌తో జాక్ లోడెన్ 5వ స్థానంలో ఉండగా, 'బాట్‌మాన్' స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్ 92.15 శాతంతో 4వ స్థానంలో నిలిచాడు. గ్లాడియేటర్ II నటుడు పాల్ మెస్కల్ 92.38 శాతం ముఖ సౌష్టవంతో 3వ ర్యాంక్ లో ఉండగా, 92.41 శాతం స్కోర్ చేసిన 'ఎమిలీ ఇన్ ప్యారిస్' స్టార్ లూసీన్ లావిస్‌కౌంట్ కంటే వెనుకబడి ఉన్నాడు.
ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బ్రిటిష్ నటుడు ఆరోన్ టేలర్-జాన్సన్ 93 శాతం మార్కులు సాధించడం విశేషం. 'క్రావెన్ ది హంటర్'లో పాత్రకు పేరుగాంచిన టేలర్-జాన్సన్ తదుపరి చలనచిత్రంలో జేమ్స్ బాండ్‌గా నటించడానికి రేసులో ముందున్నారనే పుకార్లు కూడా ఉన్నాయి. అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇంకా రాలేదు కానీ, మార్చి 2024లో ది సన్ కథనం ప్రకారం టేలర్ జాన్సన్ కి తదుపరి బాండ్ 007గా నటించే ఛాన్సుందని సమాచారం.
అందాన్ని కొలిచేదెలా?
అందం సమరూపత పై అధ్యయనం కోసం ''గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై'ని సదరు వైద్యుడు ఉపయోగించారు. ఇది ముఖ సమరూపత, పరిపూర్ణతను అంచనా వేస్తుంది. డాక్టర్ డి సిల్వా పలువురు స్టార్ల ముఖ లక్షణాలు గోల్డెన్ రేషియోతో ఎంత బాగా సరిపోతాయో లెక్కించేందుకు అధునాతన ఫేస్-మ్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. ఇది సౌందర్య పరిపూర్ణతను నిర్ణయించడానికి ఒక సాదనం. కళ -రూపకల్పనలో ఉపయోగించే సూత్రం. ఇది ముఖ సమరూపతను కొలుస్తుంది. ఒక వ్యక్తి లక్షణాలలో భౌతిక 'పరిపూర్ణత' స్థాయిని వెల్లడిస్తుంది.