తెలుగు ప్రజలకు తప్ప మిగతా వారందరికీ పాదాభివందనం!
దేశభాషలందు తెలుగు లెస్స.. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తీ గలవోడా...!నేడు తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి.
దేశభాషలందు తెలుగు లెస్స.. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తీ గలవోడా...!నేడు తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి. ఈ సందర్భంగా ప్రతి యేటా ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం. కానీ ఈ భాష దినోత్సవాన్ని నిర్వహించేది ఎక్కడ? కనీసం తెలుగు భాషకంటూ ఓ రోజు ఉందన్న సంగతి సైతం మర్చిపోయే పరిస్థితి దాపరించింది.
ఈ సందర్భంగా ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఓ కార్యక్రమంలో తెలుగు భాషని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. `తమిళనాడు రాష్ట్రంలోని ప్రజలకు నేను పాదాభివందనం చేస్తున్నాను. తెలుగు ప్రజలకు మినహా దేశంలో మిగతా భాషల ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే వారందరికీ వాళ్ల భాష అంటే ఎంతో ఇష్టం. తమిళనాడు రాష్ట్రంలో తమిళం బోధించకపోతే ఎలా ఉంటుందో తెలుసు.
కానీ మనకి ఇక్కడా అలాంటి పరిస్థితులు ఏవీ ఉండవు. ఇప్పటి తల్లిదండ్రులు తెలుగు మాట్లాడితే వాళ్ల పిల్లల్ని కొడుతున్నారు. మన రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే సమాజాన్ని నిర్మించాలి. కానీ అలా ఎక్కడ జరుగుతుంది. చదువుకున్న ఏ ఇద్దరు తెలుగులో మాట్లాడటానికి ఇష్టపడలేదు. భాష వచ్చినా మాట్లాడటం లేదు. రాకపోతే ఎలాంటి సమస్య ఉండదు.
ఇదే కొనసాగితే తెలుగు భాష అనేది భారతదేశంలో ఉందా? అన్న సందేహం మిగతా రాష్ట్రాల్లో కలుగుతుంది. అందుకు మనందరం కారణమే. తెలుగు భాష ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎన్టీఆర్ అంటే తెలుగు భాష. తెలుగు భాష అంటే ఎన్టీఆర్. పార్లమెంట్ లో సైతం తెలుగులో మాట్లాడిన వ్యక్తి ఆయన. వింటే వినండి లేకపోతే లేదు అని చెప్పిన మహనీయుడు ఆయన. లిపిలేని ఆదివాసీల భాషకు కూడా గౌరవాన్ని కల్పించిన మహానీయుడు రామ్మూర్తి. సినిమా ప్రొడక్షన్ వారు ఇలాంటి కార్యక్రమం పెట్టి పిలిచారంటే ఆశ్చర్యపోయాను. నేటి కార్యక్రమం గురించి వై.వి.ఎస్ చౌదరి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను` అని అన్నారు.