యేవమ్ ట్రైలర్.. 'మీరెవరూ పట్టించుకోరా?'
అలా యూట్యూబ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో సినీ ప్రియులను తెగ మెప్పిస్తుంది
యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుని.. ఆ తర్వాత తెలుగమ్మాయి చాందినీ చౌదరి హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల క్రితం వచ్చిన షార్ట్ ఫిల్మ్ మధురంతో కుర్రకారును ఫిదా చేసింది. అందులో తన అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. అలా యూట్యూబ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో సినీ ప్రియులను తెగ మెప్పిస్తుంది.
కలర్ ఫోటో, సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, కుందనపు బొమ్మ, సూపర్ ఓవర్, కేటుగాడు వంటి అనేక తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసింది. కోలీవుడ్ మూవీ సభా నాయగన్ లో హీరోయిన్ గా నటించి అలరించింది. ఇటీవల విశ్వక్ సేన్.. గామి సినిమాలో డాక్టర్ జాహ్నవిగా కనిపించి తన యాక్టింగ్ తో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తిలతో అలరించనుంది చాందినీ చౌదరి.
అయితే ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్న యేవమ్ సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ సాంగ్స్ తో పాటు టీజర్ ను రిలీజ్ చేశారు. తాజాగా క్రేజీ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్ ను రిలీజ్ చేశారు. వరుస హత్యలు చేస్తున్న ఓ కిల్లర్ ను పోలీసులు ఎలా పట్టుకున్నారు? కేసును ఎలా చేధించారు? అన్న విషయాల చుట్టూ యేవమ్ సినిమా తిరగనున్నట్లు ట్రైలర్ ద్వారా ఈజీగా అర్థమవుతోంది.
అమ్మాయిలకు పోలీస్ జాబ్ ఎందుకంటూ చిన్నచూపు చూసే వారి మధ్య చాందిని తన ఉద్యోగ జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొని నిలబడిందనేది సినిమాలో చూపించనున్నారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ లో పోలీస్ ఆఫీసర్ గా చాందిని అదరగొట్టేసింది. తన నటనతో కట్టిపడేసింది. సినిమాలో పోలీస్ తో లవ్ కెమిస్ట్రీ బాగానే నడిపింది. ఓ కేసు విషయంలో మీరెవరూ పట్టించుకోరా? అంటూ ఆమె ప్రశ్నించిన డైలాగ్ బాగుంది.
ఈ సినిమాను నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చాందినితో పాటు వశిష్ట సింహా, భరత్ రాజ్, అషు రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అషు రెడ్డి ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాటోగ్రాఫర్ గా విశ్వేశ్వర్ వ్యవహరిస్తుండగా.. కీర్తనా శేషు, నీలేష్ మందలపు మ్యూజిక్ అందిస్తున్నారు. జూన్ 14వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.