ఆయన నా గాడ్ ఫాదర్, అందుకే ఈ ప్రెస్మీట్
గతంలో ఎన్నో సూపర్ హిట్స్ ను తెరకెక్కించిన చౌదరి ఈ మధ్య కాలంలో అంచనాలను అందుకోలేక పోతున్నాడు
టాలీవుడ్ లో ఎన్నో విలక్షణ సినిమాలను రూపొందించిన దర్శకుడు వైవిఎస్ చౌదరి. గతంలో ఎన్నో సూపర్ హిట్స్ ను తెరకెక్కించిన చౌదరి ఈ మధ్య కాలంలో అంచనాలను అందుకోలేక పోతున్నాడు. గత కొన్నాళ్లుగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. చాలా గ్యాప్ తర్వాత అంతా కొత్తవారితో సినిమాకు రెడీ అవుతున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు తారక రామారావు హీరోగా తెలుగు అమ్మాయి వీణారావు హీరోయిన్ గా రూపొందబోతున్న ఈ సినిమాను చౌదరి సతీమణీ న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నారు.
ఇప్పటికే రెండు సార్లు సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిన చౌదరి తాజాగా మరో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమా నేపథ్యంను తెలియజేశాడు. నేడు నాగార్జున బర్త్ డే సందర్భంగా తమ సినిమా మూడో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో నాకు నాగార్జున గారు గాడ్ ఫాదర్. అందుకే ఆయన పుట్టిన రోజున ఈ మీడియా సమావేశం ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక హరికృష్ణ గారు నాకు అన్న తో సమానం. ఆయన మనవడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను అన్నాడు.
నాగార్జున, హరికృష్ణ ఇద్దరంటే నాకు అమితమైన గౌరవం. అలాంటి వారిద్దరితో 'సీతారామరాజు' సినిమాను తీయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. హరికృష్ణ గారికి తెలుగు భాష అంటే అమితమైన అభిమానం. అలాంటి తెలుగు భాష ప్రియుడు తెలుగు భాష దినోత్సవం రోజు మృతి చెందడం బాధాకరం అన్నారు. ఈ సినిమా ను 1980 టైమ్ లో జరిగే కథతో రూపొందించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. తెలుగు భాష గొప్పతనం గురించి ప్రేక్షకులకు చెప్పాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఆ కోరిక ఈ సినిమాతో తీరబోతుందని చౌదరి చెప్పుకొచ్చాడు.
అంతా కొత్త వారితో చేస్తున్న సినిమా కావడం వల్లే పదే పదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సినిమా గురించి చెబుతున్నాను. ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లడం కోసం ఇలా మీడియా ముందుకు వస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా ఈ సినిమా కోసం తారక రామారావు రెడీ అవుతున్నాడు. నటనలో శిక్షణ తీసుకోవడంతో పాటు డాన్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక హీరోయిన్ వీణారావు కూచిపూడి డాన్సర్. ఆమెకు నటనలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. త్వరలోనే మరో మీడియా సమావేశం ఏర్పాటు చేసి హీరో, హీరోయిన్స్ ను పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు.