రానున్న2 నెలల్లో రానున్న ఐపీవోల లెక్క తెలిస్తే ఆశ్చర్యమే

కొద్ది నెలలుగా దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా సూచీలు జీవిత గరిష్ఠాలకు చేరుకోవటం ఈ మధ్యకాలంలో మామూలైంది

Update: 2024-09-30 04:36 GMT

కొద్ది నెలలుగా దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా సూచీలు జీవిత గరిష్ఠాలకు చేరుకోవటం ఈ మధ్యకాలంలో మామూలైంది. మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో దేశీయంగా కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ లకు అమితమైన గిరాకీ లభిస్తోంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది భారీ ఎత్తున ఐపీవో లు వచ్చాయి. రానున్న రెండు నెలల్లోనూ భారీ ఎత్తున ఐపీవోలు రానున్నాయి. ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఇంత భారీగా ఐపీవోలు ఇదే మొదటిసారిగా చెబుతున్నారు.

గడిచిన 9నెలల్లో దేశీయంగా 62 కంపెనీలు రూ.64,513 కోట్లను ఐపీవోల ద్వారా సమీకరించాయి.రాబోయే 2 నెలల్లో మరో రూ.60వేల కోట్లను సమీకరించే దిశగా ప్రకటనలు రానున్నాయి. ఈ మొత్తాన్ని కలిపితే ఒక క్యాలెండర్ ఇయర్ (జనవరి - డిసెంబరు) లో రూ.1.25 లక్షల కోట్లను సమీకరిస్తున్నాయి.ఇప్పటివరకు 2021లో 63 కంపెనీల ఐపీవోలతో రూ.1.19 కోట్లు సమీకరణే గరిష్టంగా ఉండేది. ఇప్పుడు దాన్ని అధిగమించనుంది.

మార్కెట్ మాంచి జోరు మీద ఉండటంతో చాలామంది తమ బ్యాంకుల్లోని డిపాజిట్లను ఉపసంహరించుకొని మరీ డీ మ్యాట్ ఖాతాను ఏర్పాటు చేసుకొని షేర్లుకొంటున్నారు. మరికొందరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఐపీవోలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నారు. దీనికి తోడు ఐపీవోలో కంపెనీ ఆఫర్ చేస్తున్న షేర్లకు మార్కెట్లో 100-200రెట్లు అధకంగా బిల్డు దాఖలుకావటం ఒక ఎత్తు అయితే.. కొన్ని షేర్లు లిస్ట్ అయిన తొలి రోజే వంద శాతానికి మించి ప్రతిఫలాన్ని ఇస్తుండటంతో ఐపీవోలలో పెట్టుబడులు పెట్టే వారిసంఖ్య ఎక్కువైంది.

దీంతో.. ఐపీవోల్లో షేర్లు అలాట్ అయితే చాలు.. తమ పంట పండినట్లుగా భావిస్తున్నారు. అయితే.. కొన్ని ఎస్ఎంఈ ఇష్యూలకు ఇంతటి ఆధరణ లభించటం వెనుక మర్చంట్ బ్యాంకర్ల హస్తం ఉందన్న విషయాన్ని గుర్తించాలని మదుపర్లను సె సెబీ హెచ్చరిస్తోంది. ఐపీవోలలో పెట్టుబడులు పెట్టే వారు.. కంపెనీ ఆర్థిక మూలాలు.. వాటి కార్యాకలాపాలు.. రిస్క్ ఫ్యాక్టర్ గురించి అంచనా వేసుకున్న తర్వాతే ఐపీవోల జోలికి రావటం మంచిదంటున్నారు.

2020 నుంచి ఇప్పటివరకు వచ్చిన ఐపీవోలు.. అవి సేకరించిన మొత్తాల్ని చూస్తే.. ఈ జోరు ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఏడాది ఐపీవోలు సేకరించిన మొత్తం (రూ.కోట్లలో)

2020 15 26,628

2021 63 1,19,882

2022 40 59,939

2023 58 49,437

2024 62 64,513

(2024లో కేవలం మొదటి తొమ్మిది నెలల వరకు ఐపీవోలు లిస్ట్ అయినవి మాత్రమే లెక్కల్లోకి తీసుకున్నాం)

మరో రెండు నెలల్లో (అక్టోబరు - నవంబరుల)పెద్ద ఎత్తున ఐపీవోలు మార్కెట్లోకి రానున్నాయి. వీటిల్లో ప్రముఖ కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. అవేమంటే..

కంపెనీలు ఐపీవో విలువ (రూ.కోట్లలో)

హ్యుందయ్ మోటార్ 25,000

స్విగ్గీ 10,414

ఎన్ టీపీసీ గ్రీన్ ఎనర్జీ 10,000

అఫ్కాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ 7,000

వారీ ఎనర్జీస్ 3,000

నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ 3,000

వన్ మొబిక్విక్ సిస్టమ్స్ 700

Tags:    

Similar News