సోమవారం ఐటీ రిటర్న్ దాఖలు చేయకుంటే ఏమవుతుంది?
గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2022 ఏప్రిల్ - 2023 మార్చి) సంబంధించిన ఆదాయపన్ను రిటర్న్ ను ఆదాయపన్ను శాఖకు దాఖలు చేయటానికి తుది గడువు జులై 31. అంటే.. సోమవారం అర్థరాత్రి లోపు ఆన్ లైన్ లో దాఖలు చేయాల్సి ఉంటుంది.
గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2022 ఏప్రిల్ - 2023 మార్చి) సంబంధించిన ఆదాయపన్ను రిటర్న్ ను ఆదాయపన్ను శాఖకు దాఖలు చేయటానికి తుది గడువు జులై 31. అంటే.. సోమవారం అర్థరాత్రి లోపు ఆన్ లైన్ లో దాఖలు చేయాల్సి ఉంటుంది. నిజానికి ప్రతి ఏడాది ఇదే తుది గడువు. కరోనా ఏడాది.. ఆ తర్వాత ఏడాదిలోనూ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ తుది గడువును పెంచటం తెలిసిందే. మరి.. ఈసారి ఏం జరగనుంది? అంటే.. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేకపోవటంతో తుది గడువు పొడిగించే అవకాశం చాలా చాలా తక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐటీ రిటర్న్ ను దాఖలు చేసే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవటం మొదలు.. పలు అంశాలకు ఐటీ రిటర్న్ దాఖలు తప్పనిసరి కావటంతో తమ ఆదాయానికి సంబంధించిన రిటర్న్ దాఖలు చేస్తున్నారు. అంతకు ముందు ఏడాదికి సంబంధించి 7 కోట్ల మందికి పైగా ట్యాక్స్ రిటర్న్ ను దాఖలు చేసినట్లుగా పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించటం తెలిసిందే. దాంతో పోలిస్తే ఈ ఏడాది దాఖలు చేయాల్సిన వారు శుక్రవారం వరకు 5.35 కోట్ల మంది మాత్రమే ఐటీ రిటర్న్ లు దాఖలు చేశారు.
అంటే.. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాదికి సంబంధించి దాఖలు చేయాల్సిన వారే రెండు కోట్లకు పైనే ఉన్నట్లుగా ఆర్థిక మంత్రి మాటలతో అర్థమవుతుంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ట్యాక్స్ రిటర్న్ ల పత్రాల్ని ఆలస్యంగా ఇవ్వటం కారణమైతే.. ఇంకొందరు కురిసిన వానలు.. వరదల ప్రభావంతో ట్యాక్స్ రిటర్న్ లు దాఖలు చేసే పరిస్థితులు లేదంటున్నారు. మరికొందరు మాత్రం గడువు పెంచుతారన్న భావనతో ఉండిపోయారు. దీంతో.. పన్ను రిటర్న్ ను దాఖలు చేసేందుకు గడువు పెంచాలన్న వాదనను పలు వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే గత వారం రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ట్యాక్స్ రిటర్న్ లకు సంబంధించి గడువు పెంచాలనే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని తేల్చేశారు. దీంతో.. గడువు పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. పన్ను రిటర్న్ లకు ఈ రోజు (ఆదివారం).. రేపు (సోమవారం) అవకాశం ఉంది. ఈ లోపు కుదిరితే ఫర్లేదు.
పన్ను రిటర్న్ దాఖలకు కుదిరితే సరి. ఎలాంటి సమస్యా లేదు. మరి.. కుదరకపోతే పరిస్థితేంటి? ఏం జరుగుతుంది? అన్నది ప్రశ్నగా మారింది. గడువులోపు రిటర్న్ లను దాఖలు చేయకుంటే ఫైన్ మొత్తంతో రిటర్న్ లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయపన్ను చట్టం 1961 సెక్షన్ 234 ప్రకారం రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.వెయ్యి.. అంతకు మించి ఉన్నప్పుడు రూ.5వేల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అదే.. పన్ను చెల్లింపు బకాయి ఉన్న వారు అయితే నెలకు ఒక శాతం సాధారణ వడ్డీని సైతం చెల్లించాల్సిందే. అసలు.. ఆదాయపన్ను రిటర్న్ లను దాఖలు చేయకుండా ఉండిపోయి.. ఆదాయం ఎక్కువగా ఉన్న వారికి ఐటీ శాఖ నోటీసుల్ని పంపుతుంది. వాటికి స్పందించని పక్షంలో చెల్లించాల్సిన పన్నుపై 50 శాతం నుంచి 200 శాతం వరకు ఫైన్ విధిస్తారు. చట్టపరమైన చర్యల్ని తీసుకుంటారు. జర జాగ్రత్త. అనవసరమైన ఇబ్బందుల్ని కొని తెచ్చుకునే కంటే.. దాఖలు చేయాల్సిన రిటర్న్ లను దాఖలు చేస్తే సరి.