హైదరాబాద్‌ బిర్యానీకి పాక్‌ క్రికెటర్ల రేటింగ్‌ ఎంతంటే!

ఈ క్రమంలో పాక్‌ స్టార్‌ బ్యాట్సమన్, ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Update: 2023-10-05 10:03 GMT

హైదరాబాద్‌ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌ కు వెళ్లినవారు ఎవరైనా బిర్యానీ రుచి చూడాల్సిందే. ఎన్నో వందల ఏళ్లుగా హైదరాబాద్‌ బిర్యానీ దేశ, విదేశాల్లో ఎంతో మందికి ఇష్టమైన ఫుడ్‌ గా మారింది. అంతేకాకుండా విదేశాల్లోనూ హైదరాబాద్‌ బిర్యానీ పేరిట ప్రత్యేకంగా ప్రాంచైజీలు కూడా ఉండటం విశేషం.

ఇక ఇప్పుడు క్రికెట్‌ వన్డే వరల్డ్‌ కప్‌ ఈసారి భారత్‌ లో జరుగుతుంది. మొత్తం పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అలాగే మ్యాచ్‌ లు చూడటానికి దేశ, విదేశాల నుంచి ఎంతో మంది క్రికెట్‌ ప్రేమికులు ఇండియాకు వస్తున్నారు. ఇప్పటికే ఆడనున్న అన్ని జట్టు మన దేశానికి చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ జట్టు సైతం పది రోజుల క్రితమే భారత్‌ కు చేరుకుంది. హైదరాబాద్‌ లోని ఒక హోటల్‌ లో పాక్‌ జట్టు బస చేసింది. ఈ నేపథ్యంలో పాక్‌ ఆటగాళ్లు హైదరాబాద్‌ వంటకాలను ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కే ప్రత్యేకమైన బిర్యానీని ఒక పట్టు పట్టారు.

పాక్‌ ఆటగాళ్లు కొద్ది రోజుల క్రితం దమ్‌ బిర్యానీని తిన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) తాజాగా ఓ వీడియోని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో పాకిస్థాన్‌ క్రికెటర్లను హైదరాబాదీ బిర్యానీ, కరాచీ (పాకిస్థాన్‌ లో అతిపెద్ద నగరం) బిర్యానీల్లో ఏది బాగుంది అని ప్రశ్నించారు. అలాగే హైదరాబాదీ బిర్యానీకి ఎంత రేటింగ్‌ ఇస్తారు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో పాక్‌ స్టార్‌ బ్యాట్సమన్, ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. "హైదరాబాదీ బిర్యానీ కొంచెం ఘాటుగా (స్పైసీగా) ఉంది. ఇది దాని ప్రత్యేకత. నేను దీనికి 10కి 8మార్కులు ఇస్తున్నా" తెలిపాడు.

అలాగే పాకిస్థాన్‌ పేస్‌ బౌలర్‌ హసన్‌ అలీ అయితే హైదరాబాద్‌ బిర్యానీకి 10/10 రేటింగ్‌ ఇచ్చాడు. అదేవిధంగా మరో బ్యాట్సమన్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ కూడా రేటింగ్‌ ఇచ్చాడు. హైదరాబాద్‌ బిర్యానీ అద్భుతంగా ఉందని.. తాను 10కి 11 మార్కులు ఇస్తానని వెల్లడించాడు.

ఇక హైదరాబాద్‌ బిర్యానీకి, కరాచీ బిర్యానీకి మధ్య తేడాలు ఏంటని పాక్‌ క్రికెటర్లను ప్రశ్నించగా వారు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. బాబర్‌ అజామ్‌ హైదరాబాదీ బిర్యానీ కాస్త స్పైసీగా ఉందన్నాడు. హైదరాబాదీ బిర్యానీ బాగుంటుందని ఎప్పటినుంచో విన్నానని.. చాలా బాగుంది అని వెల్లడించాడు. కాగా రెండు బిర్యానీలూ బాగున్నాయని ఇమామ్‌ ఉల్‌ హక్‌ తెలిపాడు.

కాగా ప్రపంచకప్‌ లో పాల్గొనడానికి భారత్‌ కు వచ్చిన పాకిస్థాన్‌ జట్టు హైదరాబాద్‌ లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడింది. అయితే, ఈ రెండు మ్యాచ్‌ ల్లోనూ పాక్‌ ఓడిపోయింది.

ఇక ఇదే స్టేడియంలో ప్రపంచకప్‌ కు సంబంధించి అసలైన మ్యాచ్‌ ల్లో పాకిస్థాన్‌ అక్టోబర్‌ 6న నెదర్లాండ్స్‌ తో, అక్టోబర్‌ 10న శ్రీలంకతో ఆడనుంది. ఇక అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌ మ్యాచ్‌ జరగనుంది.

Tags:    

Similar News