సంచలనం... టైటానియంతో కృత్రిమ గుండె విజయం!
సైన్స్ రోజు రోజుకీ అభివృద్ధి చెందుతోంది. ఊహించని ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి.;
సైన్స్ రోజు రోజుకీ అభివృద్ధి చెందుతోంది. ఊహించని ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో టైటానియంతో చేసిన కృత్రిమ గుండె వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. టైటానియంతో కృత్రిమ గుండెను తయారుచేయడమే కాదు.. అది మనిషికి అమర్చి అద్భుతం సృష్టించారు. ఇది గుండెకు బదులుగా సక్సెస్ ఫుల్ గా రక్తాన్ని సరఫరా చేస్తోంది!
అవును... గుండె విఫలమైతే.. దాతలు దొరికే వరకూ మరో ఆప్షన్ లేదు. దాతలు దొరకడం అంత సులభమూ కాదు! ఈ సమయంలో దాతలతో సంబంధం లేకుండా.. గుండె విఫలమైతే వారిని టైటానియం లోహంతొ చేసిన "బైవకోర్ కృత్రిమ గుండె" ఆదుకుంటోంది. తాజాగా గంటలు కాదు.. ఏకంగా వంద రోజులకు పైగా ఒకరి ప్రాణాలు నిలిపింది. ఇప్పుడిదో సంచలనం!
వివరాళ్లోకి వెళ్తే... కొద్ది నెలల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ఈ టైటానియం గుండెను అమర్చారు. ఆయన ఈ లోహపు గుండెతో 15 రోజుల పాటు జీవించారు. కృత్రిమ గుండెతో ఆసుపత్రి వెలుపల నెల రోజులకు పైగా జీవించిన తొలి వ్యక్తిగానూ చరిత్రకెక్కారు. ఇటీవల దాత దొరకడంతో.. అతనికి మనిషి గుండె అమర్చారు.
వాస్తవానికి ఇప్పటివరకూ ఈ టైటానియం గుండెను ఆరుగురికి ప్రయోగాత్మకంగా అమర్చగా.. మిగిలిన ఐదుగురు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి మాత్రం.. ఇంటికి వెళ్లిపోయి, తన పని తాను చేసుకుంటూ, తోట పని కూడా చేస్తున్నారని అంటున్నారు.
వాస్తవానికి ఈ బైవకోర్ ను పరిశోధకులు ఇతర రకాల మాదిరిగా కాకుండా విరిగిపోని విధంగా తీర్చిదిద్దారు. ఇది తేలికగా రక్తాన్ని పంప్ చేస్తుంది.. ఇదే సమయంలో ఎక్కువ కాలమూ మన్నుతుంది. కాకపోతే.. దీనికి సంబంధించిన బ్యాటరీని కడుపు భాగంలో అమర్చగా.. అప్పుడప్పుడూ దీన్ని మార్చాల్సి ఉంటుంది!
కేవలం 650 గ్రాములే ఉండే ఈ పరికరం 12 ఏళ్ల లోపు పిల్లల ఛాతిలో కూడా ఇమిడిపోతుంది. దీనిని స్మార్ట్ కంట్రోలర్ రోగుల పనులకు అనుగుణంగా రక్త సరఫరాను నియంత్రిస్తుంది. ప్రస్తుతానికి ఈ బైవకోర్.. ప్రయోగ పరీక్షల్లో మంచి ఫలితాలు చూపిస్తుంది. దీంతో.. త్వరలోనే ఇది వాణిజ్యపరంగా అందుబాటులోకి రాగలదని భావిస్తున్నారు.
కాగా... బైవకోర్ టైటానియం గుండెను ఆస్ట్రేలియాకు చేందిన డాక్టర్ డేనియల్ టిమ్స్ రూపొందించారు. ఆయన తండ్రికి 2001లో గుండె తీవ్రంగా దెబ్బతినడంతో.. నాటి నుంచి టిమ్స్ దీనిపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గుండె రక్త ప్రసరణ వ్యవస్థను అనుకరిస్తూ ఎన్నో ప్రయోగాలు, డిజైన్లు చేశారు. ఫైనల్ గా మొట్టమొదటి లోహపు గుండె నమూనాను ఆవిష్కరించారు.