వింత వ్యాధి... సోకిన 48 గంటల్లోపే మరణం కన్ఫాం!

ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంటే.. మరోపక్క అదే స్థాయిలో అన్నట్లుగా కొత్త కొత్త వైరస్ లు, వింత వింత వ్యాధులు ప్రభలుతున్నాయి.

Update: 2025-02-26 10:42 GMT

ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంటే.. మరోపక్క అదే స్థాయిలో అన్నట్లుగా కొత్త కొత్త వైరస్ లు, వింత వింత వ్యాధులు ప్రభలుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంగో దేశాన్ని ఓ వింత వ్యాధి టెన్షన్ పెడుతుంది.. సుమారు ఐదు వారాలుగా ఆ దేశ ప్రజలకు పేరు తెలియని ఈ వ్యాధి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

అవును... ఎబోలా, డెంగ్యూ, మార్ బర్గ్, యెల్లో ఫీవర్ లక్షణాలు పోలి ఉన్నట్లు చెబుతున్న ఓ వింత వ్యాధి ఇప్పుడు కాంగో దేశ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వింత వ్యాధి సోకినవారు జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావంతో చనిపోతున్నారు. దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది.

కొన్ని వారాల క్రితం ఈ దేశంలోని బొలొకో గ్రామంలో ముగ్గురు పిల్లలు గబ్బిలాలను తిన్నారని.. అలా తిన్న 48 గంటల్లో ఆ ముగ్గురు పిల్లలు మరణించారని అంటున్నారు. దీంతో... ఈ వ్యాధి గబ్బిలాల ద్వారా సంక్రమిస్తుందా అనే చర్చ మొదలైందని అంటున్నారు. ఈ వ్యాధి ఇప్పటివరకూ 431 మందికి సోకగా.. అందులో 53 మంది ఇప్పటికే మరణించారని చెబుతున్నారు.

ఫిబ్రవరి 9న బోమాటే గ్రామంలో ఈ మిస్టరీ వ్యాధి సోకిన 13 కేసుల నుంచి నమూనాలను పరీక్ష కోసం కాంగో రాజధాని కిన్షాసాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ కు పంపినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అన్ని శాంపిల్స్ రెగ్యులర్ హెమరేజిక్ ఫీవర్ కు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపింది.

కాగా... కాంగోలోని క్వాంగో ప్రావిస్నులో గత ఏడాది నవంబర్ లో అంతుచిక్కని ఓ వింత వ్యాధి సుమారు 150 మందిని బలిగొన్న సంగతి తెలిసింది. ఫ్లూవంటి లక్షణాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ వ్యాధికి గురైన చాలా మంది రోగులు తమ తమ ఇళ్లల్లోనే మరణిస్తున్నారని అధికారులు తెలిపారు.

గత ఏడాది నవంబర్ 10 నుంచి 25 మధ్య పాంజీ హెల్త్ జోన్ లో అంతుచిక్కని వ్యాధి బారిన పడటంతో ఈ మరణాలు సంభవించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి, దగ్గు వంటివి ఈ గుర్తు తెలియని వ్యాధి లక్షణాలని ప్రొవిన్షియల్ హెల్త్ మినిస్టర్ యుంబా తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో వింత వ్యాధి బారిన కాంగో ప్రజలు పడుతున్నారని అంటున్నారు. ఈ వ్యాధి సోకినవారిలో సగం మంది 48 గంటల్లోనే మరణిస్తున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News