యావత్ ప్రపంచమే లావెక్కిపోతోంది.. మన దేశంలో ఎందరంటే?

ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా యావత్ ప్రపంచమే లావెక్కిపోతుందన్న కొత్త నిజాన్ని గుర్తించిందో అధ్యయనం.;

Update: 2025-03-05 03:36 GMT

ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా యావత్ ప్రపంచమే లావెక్కిపోతుందన్న కొత్త నిజాన్ని గుర్తించిందో అధ్యయనం. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అన్ని వయస్కుల వారిని ఈ ఊబకాయం ఇబ్బంది పెట్టెస్తోంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సగానికి పైగా వయోజనులు ఊబకాయులుగా మారారని.. 2050 నాటికి అంటే మరో పాతికేళ్లకు ఇది కాస్తా 57 శాతానికి దాటేస్తుందన్నఅంచనా వేశారు.

ప్రముఖ జర్నల్ గా పేరున్న లాన్సెట్ 200 దేశాలకు చెందిన డేటాను విశ్లేషించి ఈ రిపోర్టును సిద్ధం చేసింది. గడిచిన పదేళ్ల కాలంలో అల్పాదాయ దేశాల్లోనూ ఊబకాయం వేగంగా పెరుగుతోందని.. దీని కట్టడికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అమెరికాలోని వర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కు చెందిన ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ నాయకత్వంలో ఈ రీసెర్చ్ జరిగింది. ఊబకాయుల సంఖ్య 1990తో పోలిస్తే ఇప్పుడు రెట్టింపుగా ఉన్నట్లు గుర్తించారు.

2021 నాటికి ప్రపంచ వయోజనుల్లో సగం మంది ఊబకాయులుగా మారారు. 25 ఏళ్లు.. అంతకు పైబడిన వారిలో ఏకంగా 100 కోట్ల పురుషులు.. 111 కోట్ల మంది మహిళలు అధిక బరువుతో బాధ పడుతున్నట్లుగా గుర్తించారు. ఇదే ట్రెండ్ కొనసాగితే 2050 నాటికి వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య పురుషుల్లో 57.4 శాతం.. స్త్రీలలో 60.3 శాతానికి పెరగొచ్చని చెబుతున్నారు.

1990 నుంచి 2021 నాటికి పిల్లలు.. టీనేజర్లలో ఊబకాయులు 8.8 శాతం నుంచి 18.1 శాతానికి పెరిగారు. 20 - 25 మధ్య వయసు యువతలో 9.9 శాతం నుంచి 20.3 శాతానికి పెరిగినట్లుగా తేల్చారు. ఊబకాయుల సంఖ్య చైనాలో 2050 నాటికి 62.7 కోట్లు కాగా.. భారత్ లో 45 కోట్లు .. అమెరికాలో 21.4 కోట్లకు చేరనున్నట్లుగా అంచనా వేశారు. ఆఫ్రికా దేశాల్లో అయితే ఇది 250 శాతానికి పెరిగి 52.2 కోట్లకు చేరుతుందని తేల్చారు. ఊబకాయం పెరగటం ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు సవాలుగా చెబుతున్నారు. ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ ఊబకాయం సమస్య అంతకంతకూ పెరగటం ఆందోళనకు గురి చేసే అంశంగా చెబుతున్నారు.

Tags:    

Similar News