హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌.. ఏమిటీ వ్యాధి?

హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లో చిన్నారులను కలవరపాటుకు గురిచేస్తోంది.

Update: 2024-09-29 05:10 GMT

హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లో చిన్నారులను కలవరపాటుకు గురిచేస్తోంది. నెలల శిశువుల ఆరేళ్ల వయసు వరకు ఉన్న పిల్లలకు ఈ వ్యాధి వ్యాపిస్తోంది. చేతులు, ముఖం, కాళ్లు, నోటి మీద పొక్కులు, దద్దుర్లు, పుండ్లు వంటివి రావడం హ్యాండ్‌ పుట్‌ మౌత్‌ వ్యాధిలో ప్రధాన లక్షణాలు.

హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ వ్యాధి కాక్సికీ అనే వైరస్‌ ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధిగ్రస్తుల మలం, లాలాజలం, దగ్గు, తుమ్ముల వల్ల వచ్చే తుంపర్లలోని వైరస్‌ నోటి ద్వారా కడుపులోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని వైద్యులు వివరిస్తున్నారు. ఈ వ్యాధికి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే లక్షణాలున్నాయని, కాబట్టి ఇది సోకిన పిల్లలను తల్లిదండ్రులు స్కూలుకు పంపవద్దని సూచిస్తున్నారు.

ఇటీవల భారీ వర్షాలకు, వరదలతో నీరు కలుషితమై ప్రజలు మలేరియా, డెంగీ, దగ్గు వంటివాటి బారిన పడుతున్నారు. ఇప్పుడు చిన్నారులను హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ వ్యాధి బెంబేలెత్తిస్తోంది. అయితే ఇది ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని అంటున్నారు.

హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ వ్యాధి గతంలోనే ఉన్నప్పటికీ ప్రస్తుతం చిన్నారులపైనే దాని ప్రభావం ఎక్కువ ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో రోజుకు కనీసం నాలుగు కేసులు వస్తున్నట్టు చెబుతున్నారు.

హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ వ్యాధి సోకిన చిన్నారుల చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో చిన్న చిన్న పొక్కులు, పుండ్లు వస్తాయి. కొందరిలో జ్వరం, జలుబు, గొంతు నొప్పి, నోటిలో మంట కూడా ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే మోకాళ్లు, మోచేతులపైన కూడా కొన్ని సందర్భాల్లో పొక్కులు వ్యాపిస్తాయని చెబుతున్నారు. చాలా అరుదుగా, లక్షల్లో ఒకరికి నిమోనియా పాంక్రియాటైటిస్, మెదడువాపు, జ్వరం వంటి లక్షణాలు కూడా ఉంటాయని పేర్కొంటున్నారు.

హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ వ్యాధి తగ్గడానికి నాలుగైదు రోజులు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు వారం రోజుల వరకు ఉంటాయని అంటున్నారు.

హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నోటి తుంపర్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుందని చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు çపంపవద్దని పేర్కొంటున్నారు.

హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ వ్యాధి సోకినవారికి సాధారణ పారాసెటమాల్‌ వంటి మందులు సరిపోతాయని వైద్యులు చెబుతున్నారు. పుండ్లు, పొక్కులు త్వరగా మాడిపోవడానికి ఆయింట్మెంట్స్‌ వాడాలని వివరిస్తున్నారు.

Tags:    

Similar News