కరోనా తర్వాత గుండెపోటు కేసులు పెరిగాయి ఎందుకు?
చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే కేసులు చాలా అరుదుగా వినేవాళ్లం
చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే కేసులు చాలా అరుదుగా వినేవాళ్లం. కానీ.. కరోనామహ్మమారి తర్వాత మాత్రం అలాంటి ఉదంతాలు బోలెడన్ని వింటున్న పరిస్థితి. కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాలు చాలామందికి భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీనికి తోడు..కరోనా నేపథ్యంలో తీసుకున్న వ్యాక్సిన్ల కారణంగానే గుండెపోటు కేసులు ఎక్కువ అవుతున్నాయన్న ఆరోపణ బలంగా వినిపించటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆకస్మికంగా గుండెపోటుతో ఎందుకు చనిపోతున్నారు? దీనికి వ్యాక్సిన్ ఏమైనా కారణమా? అసలు కారణాలేంటి? లాంటి అంశాలపై బారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రీయ అధ్యయనం చేపట్టింది. వీరి పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. అవేమంటే..
- కరోనా రాని యువకులతో పోలిస్తే కరోనా వైరస్ సోకిన వారు మొదటి వారంలో గుండెపోటుకు గురయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ. అదే రెండో వారంలో రెండున్నర రెట్లు.. ముప్ఫై రోజుల తర్వాత రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉంది.
- యువతలో గుండెపోటు ముప్పును పెంచటంలో ఆల్కహాల్.. సిగరెట్.. డ్రగ్స్.. మితిమీరిన వ్యాయామం లాంటి కారణాలు.. కరోనా సోకటం కూడా యూత్ కు ముప్పును పెంచింది.
- కొవిడ్ వ్యాక్సిన్ తో గుండెపోటు మరణాల వాదనలో నిజం లేదు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా గుర్తించారు.
- మరణించిన 729 యువకుల్లో 31.6 శాతం మంది అసలు వ్యాక్సిన్ తీసుకోలేదు. కొవిడ్ తో ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకున్నవారు 2.3 శాతం. పొగతాగేవారు 26 శాతం.. ఆల్కహాల్ తీసుకునే వారు 27 శాతం.. చనిపోవటానికి 48 గంటల ముందు విపరీతమైన ఆల్కహాల్ తీసుకున్న వారు 7 శాతం ఉన్నారు.
- మరణించిన వారిలో కొకైన్.. హెరాయిన్ లాంటి డ్రగ్స్ తీసుకునే వారు1.7 శాతం.. ఎలాంటి వ్యాయాం చేయని వారు 81 శాతం.. మరణానికి 48 గంటల ముందు విపరీతమైన శారీరక శ్రమ.. అధిక వ్యాయామం చేసిన వారు 3.5 శాతం ఉన్నారు.
- ఆకస్మిక మరణాల్లో సాధారణ వ్యాయామం చేసే వారు 16 శాతం.. ఆకస్మికంగా మరణించిన యువకులకు చెందిన కుటుంబ సభ్యులు 10 శాతం ఉన్నారు. అంటే.. గుండెపోటు హిస్టరీ ఉన్న ఫ్యామిలీ అన్న మాట. కుటుంబ సభ్యులు అంటే తండ్రి..తల్లి.. తోబుట్టువులుగా ఐసీఎంఆర్ పేర్కొంది.
- కొవిడ్ తో ఆసుపత్రుల్లో చేరిన యువకుల్లో సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఆకస్మిక మరణాలు నాలుగు రెట్లు అధికం.
- వ్యాయామం చేస్తున్నప్పుడు సాధారణంగా రెండు నిమిషాల్లోనే శ్వాస అదుపులోకి వస్తుంది. కానీ.. 10 నిమిషాల పాటు శ్వాస అదుపులోకి తీసుకోవటం జరిగిందంటే.. అలాంటి వారు చేసేది మితిమీరిన వ్యాయామం. అలాంటి వారిలో మరణాలు చోటు చేసుకున్నాయి.
- కొవిడ్ వ్యాక్సిన్ తో మరణాలు చోటు చేసుకోలేదు. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువ. దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 47 మెడికల్ కాలేజీలు.. వాటి అనుబంధ ఆసుపత్రుల పరిధిలో సీఎంఆర్ పరిశోధన చేసింది. 2021 అక్టోబరు నుంచి 2023 మార్చి 31 వరకు కరోనా కాలంగా యువకుల ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేసి ఈ నివేదిక ను సిద్ధం చేశారు.
- ఆయా కాలేజీల పరిధిలో 18-45ఏళ్ల మధ్య వయస్కులు గుండెపోటుతో మరణించిన 29,171 మంది యువకుల్లో 729 మంది మీద ప్రత్యేకంగా పరిశోధన చేసి.. ఈ రిపోర్టును సిద్ధం చేశారు.