ఇడ్లీ తింటే క్యాన్సర్.. ఇలా చేస్తే ఆ ముప్పు మిస్!

తాజాగా అలాంటి ఉదంతమే ఇడ్లీలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయన్న ప్రచారం.;

Update: 2025-02-28 17:30 GMT

ప్రజల్ని అలెర్టు చేయటానికి.. అవగాహన కల్పించటానికి సమాచారాన్ని సరైన పద్దతిలో చేరవేయటం అవసరం. అయితే.. త్వరగా అందరి కంట్లో పడాలి.. అందరూ తమ సమాచారాన్ని చదవాలన్న ఆత్రుతతో కొన్ని మీడియా సంస్థలు కొద్దికాలంగా విషయాన్ని నెగిటివ్ గా చెప్పటం మొదలు పెట్టారు. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పకుండా ట్విస్టు చేసి చెప్పే పద్దతి పాపులర్ అయ్యింది. దీంతో.. అనవసరమైన కన్ఫ్యూజన్ కు కారణమవుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే ఇడ్లీలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయన్న ప్రచారం.

అసలు విషయం వేరు. చెప్పటంలో ట్విస్టు చేయటంతో కొందరు కంగారు పడుతున్న పరిస్థితి. ఇడ్లీలు ఎక్కువగా తింటారా?పారాహుషార్.. ఆరోగ్యానికి మంచిదని ఇడ్లీలు తింటున్నారా? అయితే.. క్యాన్సర్ బూచి పొంచి ఉందన్న వ్యాఖ్యల్ని చూస్తే.. అసలు విషయాన్ని సరైన రీతిలో చెప్పట్లేదని మాత్రంచెప్పొచ్చు. అసలేం జరిగిందంటే.. బెంగళూరులోని ఆరోగ్య శాఖ అధికారులు హోటళ్లు.. రోడ్డు పక్కన ఉంటే టిఫిన్ సెంటర్లు. వీధి వ్యాపారాలు తయారు చేసే ఇడ్లీలను పరిశీలించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల నుంచి సేకరించిన ఇడ్లీలను ల్యాబ్ కు పంపి.. పరీక్షలు జరిపారు.

దాదాపు 500 ఇడ్లీ శాంపిల్స్ లో 35 శాంపిల్స్ లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ రసాయనాలు వినియోగదారుల్లో క్యాన్సర్ కు కారకంగా మారతాయని తేల్చారు. మరిన్నిశాంపిల్ పరీక్షా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే.. ఇడ్లీలో క్యాన్సర్ కారక రసాయనాలు ఎలా వచ్చాయన్నది ప్రశ్న. దీనికి తేలిందేమంటే.. వేడి వేడి ఇడ్లీలను ప్లాస్టిక్ ప్లేట్లు.. కాగితం ప్లేట్లలో సర్వ్ చేయటం తెలిసిందే. ఈ వేడి ఇడ్లీలు పల్చటి ప్లాస్టిక్ లోని రసాయనాల్ని సంగ్రహించటంతో ఈ పరిస్థితి. అంతే.. ఇంట్లో తినే ఇడ్లీలతో డేంజర్ లేదు. అదే సమయంలో కొన్ని హోటళ్లలో ప్లాస్టిక్ కాకుండా అరటి ఆకులో వడ్డిస్తారు. దానితోనూ ఇబ్బంది లేదన్నది మర్చిపోకూడదు. సో.. ఇడ్లీ తింటే క్యాన్సర్ ప్రమాదం పొంచి లేదు. దాన్ని ప్లాస్టిక్ ప్లేట్లలో వడ్డించుకొని తినే వారికే ప్రమాదం పొంచి ఉందన్నది మర్చిపోవద్దు సుమా.

Tags:    

Similar News