ఏఐతో ఈ మూడు ఉద్యోగులకు ముప్పు లేదట?
కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి చెందుతున్న కొద్దీ, దాని ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉంటుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది.;

కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి చెందుతున్న కొద్దీ, దాని ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉంటుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. చాలా మంది ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందుతుండగా, మరికొందరు మాత్రం కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తాజాగా స్పందించారు. రానున్న రోజుల్లో ఏఐ కారణంగా ఎన్నో ఉద్యోగాలు నిరుపయోగంగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, మిగతా రంగాలతో పోలిస్తే మూడు రకాల వృత్తులకు మాత్రం ఈ ఆటోమేషన్ ముప్పు కాస్త తక్కువగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఆ రంగాలు కోడింగ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్, బయాలజీ అని ఆయన తేల్చి చెప్పారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత, పరిస్థితులకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే లక్షణం ఏఐకి ఇంకా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన తెలిపారు.
-కోడింగ్:
కోడింగ్ ఉద్యోగాలు కూడా ఏఐ వల్ల పోయే అవకాశం ఉందనే భయం చాలా మందిలో ఉంది. కోడ్‌ను రూపొందించడంలో, కొన్ని ప్రోగ్రామింగ్ పనులను పూర్తి చేయడంలో ఏఐ మానవుల అవసరం లేకుండానే సమర్థవంతంగా పని చేయగలదు. కానీ, కచ్చితత్వం, లాజిక్, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాల విషయంలో ఏఐ ఇంకా మానవుల కంటే వెనుకబడి ఉంది. సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి ఈ లక్షణాలన్నీ ఎంతో అవసరం. డీబగ్గింగ్, ఏఐను మరింత మెరుగుపరచడంలో ప్రోగ్రామర్ల పాత్ర ఎంతో కీలకమని బిల్‌గేట్స్ అభిప్రాయపడుతున్నారు. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ కోడ్ రాయడంలో సహాయపడతాయి, కానీ అనుకోకుండా వచ్చే సమస్యలను పరిష్కరించడానికి మాత్రం ప్రోగ్రామర్లు తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
-ఎనర్జీ మేనేజ్‌మెంట్:
ఎనర్జీ రంగ నిపుణులను ప్రస్తుతానికి ఏఐ ఢీకొట్టలేదని బిల్‌గేట్స్ చెబుతున్నారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, స్థిరమైన పరిష్కారాలను అమలు చేయడం, విద్యుత్ అంతరాయాలు, వనరుల కొరత వంటి సంక్షోభాలను పరిష్కరించడానికి మానవ నైపుణ్యం చాలా ముఖ్యమైనది. ఏఐలా కాకుండా, ఈ రంగ నిపుణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలరు. అంతేకాకుండా, వారు నైతిక విలువలు, పర్యావరణ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారని గేట్స్ వివరించారు.
-బయాలజీ:
జీవశాస్త్ర రంగం విషయానికి వస్తే, పెద్ద మొత్తంలో ఉన్న డేటాను విశ్లేషించడానికి, వ్యాధులను నిర్ధారించడానికి ఏఐ ఉపయోగపడుతుంది. అయితే, వైద్య పరిశోధనలు, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన వంటి అంశాలు జీవశాస్త్రవేత్తలకు అత్యంత ముఖ్యమైనవి. ఈ లక్షణాలు ప్రస్తుతం ఉన్న సాంకేతికతకు మానవుల స్థాయిలో లేవని బిల్‌గేట్స్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
-ప్రధానమంత్రి మోదీ ఏమన్నారంటే:
ఇదిలా ఉంటే, గతంలో ప్రధాని మోదీ కూడా ఏఐ వల్ల ఉద్యోగాలపై ప్రభావం గురించి మాట్లాడారు. "ఈ సాంకేతికత వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయి. దానితో ఉద్యోగాలు పోతాయనే వదంతులు ఉన్నాయి. కానీ చరిత్రను చూస్తే, పని ఎప్పుడూ ఉంటుంది. అయితే పనిచేసే పద్ధతిలో మార్పులు వస్తుంటాయి. కొత్త రకం ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి నైపుణ్యాభివృద్ధి (స్కిల్లింగ్), తిరిగి నైపుణ్యాలను నేర్చుకోవడం (రీస్కిల్లింగ్) అవసరం. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే మంచి అవకాశాలు ఉంటాయి" అని ఆయన స్పష్టం చేశారు.
మొత్తానికి ఏఐ రానున్న రోజుల్లో అనేక ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే, బిల్‌గేట్స్ అభిప్రాయం ప్రకారం కోడింగ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్, బయాలజీ వంటి రంగాలు ఈ మార్పును తట్టుకొని నిలబడే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రంగాలపై దృష్టి సారించిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉండొచ్చు. అలాగే, మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం కూడా ఉద్యోగార్థులకు ఎంతో ముఖ్యం.