20 రోజులకే ఉద్యోగం నరకం.. ఏం జాబ్ అయ్యా ఇదీ
ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అనేవారు.. కానీ ఈ కాలంలో ‘జాబ్ కొట్టి చూడు’ అన్నది పెద్ద సవాల్ గా మారింది.
ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అనేవారు.. కానీ ఈ కాలంలో ‘జాబ్ కొట్టి చూడు’ అన్నది పెద్ద సవాల్ గా మారింది. జాబ్ కొట్టినా నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. ఒక్కొక్కరిది ఒక్కో వ్యథగా మారింది. నేటి తరం యువత తమ ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్న అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వారి కష్టాలన్నీ వెలుగుచూస్తున్నాయి. ఉద్యోగాల్లో ఎదురయ్యే సమస్యలు, అధికారి-ఉద్యోగుల మధ్య పొరపొచ్చాలు, ఉద్యోగ సౌలభ్యాలు వంటి అంశాలపై వారు చర్చిస్తూ ఇతరుల అభిప్రాయాలను తెలుసుకుంటారు. తాజాగా, ఓ కొత్తగా జాబ్ లో చేరిన యువ ఉద్యోగి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఉద్యోగంలో చేరిన 20 రోజుల్లోనే తనను తొలగించారంటూ అతను వివరించిన అనుభవం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
- 20 రోజుల్లో ఉద్యోగానికి ముగింపు!
గుర్‌గ్రామ్‌లోని ఓ స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం పొందిన యువకుడు తన అనుభవాన్ని రెడిట్‌లో పంచుకున్నాడు. ‘‘ఉద్యోగంలో చేరిన మూడో రోజుకే నాపై అనవసర నిందలు వేయడం మొదలైంది. నేను వినయంగా లేనని, నా వైఖరితో సమస్య ఉందని నా పై అధికారులు పేర్కొన్నారు. నేను ఎప్పుడూ మర్యాదగా, సమర్థవంతంగా పని చేసినా, వారు నా మీద ఇలా ఎందుకు అనుకుంటున్నారో అర్థం కాలేదు’’ అంటూ తన కష్టాలను వెల్లడించాడు.
-సంస్థ నియమాలు.. ఉద్యోగం కోల్పోవడానికి కారణమా?
ఆ యువకుడు తన సహోద్యోగులతో కలిసి టీ బ్రేక్ కోసం వెళ్లడం, పని పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్లడం తన ఉద్యోగ దశను ప్రభావితం చేసినట్లు అనిపిస్తోంది. ‘‘నా సహోద్యోగులిద్దరితో కలిసి టీ బ్రేక్ కోసం వెళ్లడం వారికి నచ్చలేదు. ‘గుంపులుగా వెళ్లొద్దు’ అనే సూచన ఇచ్చేవారు. అలాగే, పని పూర్తయిన వెంటనే 7 గంటలకు ఇంటికి వెళ్తుండేవాణ్ని. కొన్ని రోజులకు ఇదీ వారి కోపానికి కారణమైందంట’’ అని పోస్ట్‌లో పేర్కొన్నాడు.
-ఫైనల్ షాక్.. ఉద్యోగం నుండి తొలగింపు
20వ రోజు వచ్చేసరికి పరిస్థితి మరింత దిగజారిపోయిందని అతను పేర్కొన్నాడు. ‘‘అప్పుడు ‘డెస్క్‌లో కాకుండా డైరెక్టర్ క్యాబిన్‌లో పని చేయాలి’ అని అన్నారు. దానికి కూడా అంగీకరించాను. కానీ అదే రోజు సాయంత్రం 7 గంటలకు నా సహోద్యోగులు ఎవరైనా ఉన్నారా అని క్యాబిన్ బయట చూసాను. అంతే, డైరెక్టర్ చాలా కోపంతో ‘నేను ఇక్కడ మాట్లాడుతుంటే బయట ఎందుకు చూస్తున్నావు?’ అంటూ అరవడం మొదలుపెట్టారు. వెంటనే హెచ్‌ఆర్ టీమ్‌కు ఉద్యోగం నుండి తొలగించమని ఆదేశించారు’’ అని వివరించాడు.
-నెటిజన్ల స్పందన
ఈ పోస్ట్‌పై నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు అతనికి ధైర్యం చెబుతూ, ‘‘ఈ కంపెనీ వాతావరణం అంత అనుకూలంగా లేదని తెలుస్తోంది. మీరు బయటపడటమే మంచిది’’ అని సూచించారు. మరికొందరు ‘‘ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త అవకాశాల కోసం ప్రయత్నించండి’’ అంటూ సలహా ఇచ్చారు.
- ఉద్యోగ దశలో ఇలాంటి సవాళ్లు సాధారణమే
యువత తమ మొదటి ఉద్యోగాల్లో ఇలాంటి అనుభవాలను ఎదుర్కోవడం అసాధారణమేమీ కాదు. కానీ, ఉద్యోగం ఎంపిక చేసుకునే ముందు సంస్థ విధులు, ఆచరణలు, సంస్కృతి వంటి అంశాలను పరిశీలించడం అవసరం. ఇలాంటి అనుభవాలను పంచుకోవడం ద్వారా ఇతరులకు కూడా అవగాహన పెరగొచ్చు. ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను ధైర్యంగా ఎదుర్కొంటూ, ముందుకు సాగడమే సఫలతకు మార్గం.