నలుదిక్కులా యుద్ధ మేఘం.. 2025.. సమరమా? సంధి సంవత్సరమా?
ఇటువైపు ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు సాయంగా 1500 మంది సైన్యాన్ని పంపుతోంది. అటువైపు దక్షిణ కొరియా మీదకు దూకుడుగా వెళ్తోంది.
మరొక్క రెండు నెలల్లోపే కొత్త సంవత్సరం రానుంది.. దాంతోపాటే అమెరికాలో కొత్త నాయకత్వం కొలువుదీరనుంది. ప్రపంచ పెద్దన్నగా భావించే దేశంలో రాజకీయ మార్పు కనిపించనుంది. మరి.. కొత్త సంవత్సరం 2025లో ఏం జరుగుతుంది..? ప్రపంచ గమనం ఏమిటి.? ఇప్పటికే రెండు యుద్ధాలు ఎడతెగకుండా సాగుతున్నాయి. మూడో, నాలుగో యుద్దమూ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.. ఈ పరిస్థితి తలెత్తకుండా ప్రపంచంలో శాంతి నెలకొంటుందా..? లేక మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా?
పశ్చిమాసియా నిప్పును ఆర్పేదెవరు?
గాజా నుంచి దూసుకొచ్చిన హమాస్ మిలిటెంట్లు.. నిరుడు అక్టోబరు 7న ఇజ్రాయెల్ లో తీవ్ర విధ్వంసం రేపారు. అలా మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 13 నెలలుగా జరుగుతోంది. ఇది లెబనాన్, సిరియా, ఆఖరికి ఇరాన్ లకూ విస్తరించింది. హమాస్ ల గడ్డ గాజాను తీవ్రంగా నష్టపరిచిన ఇజ్రాయెల్.. లెబనాన్ కేంద్రంగా దానికి మద్దతు ఇస్తున్న మరో మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా పైనా దాడులకు దిగింది. అయితే, ఇక్కడే ఇరాన్ గురించి చెప్పాలి. హిజ్జుల్లాలు ఇరాన్ పెంచి పోషించిన సంస్థ. వారిని టార్గెట్ చేయడమే కాక తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ పొలిటికల్ చీఫ్ హనియేను ఇజ్రాయెల్ హత్య చేయడంతో ఇరాన్ కూడా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ రెండు దఫాలుగా రాకెట్ల దాడికి దిగింది. ప్రతిగా ఇజ్రాయెల్ సైతం దాడులు చేసింది. ఇప్పుడు ఇరాన్ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూపై ఒత్తిళ్లు వస్తున్నాయి. అదే జరిగితే.. ఇప్పటికే మానని గాయంలా ఉన్న పశ్చిమాసియాలో పెను విధ్వంసమే. దీనికి అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయిన ట్రంప్ వంటి నాయకులే అడ్డుకట్ట వేయగలరనే వాదన వినిపిస్తోంది. ఇదేకాదు.. ఇటీవల పశ్చిమాసియాలో మరో ఘటన కూడా జరిగింది. సిరియాపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్–ఐసిస్ కు ఆశ్రయం ఇస్తోందంటూ ఈ దాడులు చేసింది. సిరియాలోని ఐసిస్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రెండు నెలలుగా యుద్ధం చేస్తోంది. దీనికి అంతం ఎప్పుడో చూడాల్సి ఉంది.
రష్యా వెనక్కు తగ్గుతుందా?
వచ్చే ఫిబ్రవరికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై మూడేళ్లవుతుంది. ఇప్పటికీ రష్యా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఉత్తర కొరియా సైనిక సాయమూ తీసుకుంటోంది. అయితే, ట్రంప్ వంటి నాయకుడు చెబితే రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కుతగ్గే చాన్సుంది. కానీ, ఇప్పటికే చాలా దూరం వచ్చేసిన పుతిన్ ఆ పనిచేస్తే అవమానమే. కాకపోతే.. కాస్త ప్రయోజనం చూసుకుని రాజీకి దిగొచ్చు. అప్పటివరకు మాత్రం ఉక్రెయిన్ పై ఊపిరి సలపకుండా రష్యా యుద్ధం చేస్తూనే ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ఉప్పు-నిప్పు.. కయ్యానికి కాలు..
80 ఏళ్ల కిందటివరకు కలిసే ఉన్న ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు ఇప్పుడు ఉప్పు-నిప్పుగా మారాయి. మరీ ముఖ్యంగా ఉత్తర కొరియా నిత్యం కయ్యానికి కాలు దువ్వుతూ రెచ్చగొడుతూ ఉంటుంది. కొన్నాళ్లుగా చెత్త బెలూన్లు పంపుతూ, సరిహద్దులను తవ్వేస్తూ దక్షిణ కొరియాను కవ్విస్తోంది. ఇటువైపు ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు సాయంగా 1500 మంది సైన్యాన్ని పంపుతోంది. అటువైపు దక్షిణ కొరియా మీదకు దూకుడుగా వెళ్తోంది. దక్షిణ కొరియాకు అమెరికా మద్దతు ఉండడంతో ఏం జరిగినా అది మరో యుద్ధంగా మారే ప్రమాదం ఉంది.
తైవాన్.. డ్రాగన్ తోక తొక్కినట్లే
తైవాన్ విషయం చెబితే చాలు.. డ్రాగన్ తమ తోక తొక్కినట్లే భావిస్తుంది. తైవాన్ తమది స్వతంత్ర దేశంగా పేర్కొంటే.. చైనా మాత్రం వన్ చైనా అంటూ ఉంటుంది. తైవాన్ కు అమెరికా మద్దతు ఉంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఇటీవల తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలకు దిగింది. ఆ దేశాన్ని భయపెట్టేందుకు ఇలాంటివి తరచూ చేస్తుంటుంది. ఒకవేళ ఏమైనా పరిస్థితి ఉద్రిక్తంగా మారితే ఇక్కడా యుద్ధం తప్పదు.
ఆపేదెవరు? ఎగదోసేదెవరు?
2025.. అంతా కూడితే 9 అంకె వచ్చే సంఖ్య.. చాలామంది లక్కీ నంబర్ గానూ భావిస్తుంటారు. అలాంటి సంవత్సరంలో ఏం జరగనుంది.. ప్రపంచంలో శాంతి పవనాలు వీస్తాయా? లేక మరింత దట్టమైన యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా? దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? ప్రపంచ ప్రసిద్ధి చెందిన పలువురు జ్యోతిష్యులు 2025 నాటికి ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి వాళ్ల మాట నిజమవుతుందా? అని అందరిలోనూ టెన్షన్ మొదలైంది.