పాకిస్థాన్ లో ఏం జరుగుతోంది..? ఒక్క రోజే 47 మంది సైనికుల మరణం
అది కూడా భారీగా సైనికుల మరణం కావడం గమనార్హం.
పొరుగు దేశం పాకిస్థాన్ లో ఏం జరిగినా మనం ఒక లుక్ వేయాల్సిందే.. అసలే సైన్యం నియంత్రణ అధికంగా ఉండే దేశం.. పైకి మాత్రమే ప్రజాస్వామ్యం.. పైగా బలూచిస్థాన్ అనే ప్రాంతం ఎప్పట్నుంచో స్వయం ప్రతిపత్తి కోరుతోంది. దీంతోపాటు తరచూ దాడులు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి కల్లోలం రేగేలా కనిపిస్తోంది. అది కూడా భారీగా సైనికుల మరణం కావడం గమనార్హం. దీనికి పాకిస్థాన్ సైన్యం ఎలా స్పందిస్తుందో.?
బలూచిస్థాన్.. పాకిస్థాన్ లో గిరిజన తెగల డామినేషన్ ఉన్న ప్రాంతం. ఇక్కడ తరచూ పాక్ సైన్యం-స్థానిక తెగల మధ్య ఘర్షణలు జరుగుతుంటాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పేరిట ఓ విభాగమే ఉంది. బీఎల్ఏ తాజాగా పాక్ సైన్యంపై ఊహించని స్థాయిలో దాడికి దిగింది
నలుగురు కాదు.. 47
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడిలో నలుగురు సైనికులే చనిపోయారని పాకిస్థాన్ సైన్యం చెబుతోంది. కానీ, ఆ సంఖ్య 47 అంటోంది బీఎల్ఏ. ఈ మేరకు బలూచిస్థాన్ పోస్ట్ అనే పత్రికలో ప్రకటించింది. వీరేకాక 30 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. కాగా, బీఎల్ఏ దాడి చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేసిన ప్రకారం.. వెళ్తున్న బస్సులో పేలుడు సంభవించింది. ఈ ఘటన శనివారం తుర్బత్ వద్ద జరిగింది. పాకిస్థాన్ సైనికుల కాన్వాయ్ పై బీఎల్‌ఏ మాజిద్ బ్రిగేడ్ ఆత్మాహుతి దళం దాడి చేసింది. తుర్బత్ మరో 8 కిలోమీటర్లు ఉందనగా సాయంత్రం 5.45 సమయంలో దాడి జరిగింది.
అచ్చం పుల్వామాలో లోగానే
జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరిలో ఏం జరిగిందో అందరూ చూశారు. భారత సైనికుల కాన్వాయ్ పై పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు దాడికి దిగారు. దీంతో 40 మంది చనిపోయారు. ఈ ఘోరం భారత దేశాన్ని అంతటినీ కదిలించింది. ఇప్పుడు బలూచిస్థాన్ లోని తుర్బత్ లోనూ అదే విధంగా దాడి జరిగింది.
ఐదు బస్సులు సహా ఏడు సైనిక వాహనాల కాన్వాయ్ పై దాడి జరిగింది. ఇవి కరాచీ నుంచి తిర్బత్‌లోని ఫ్రాంటియర్ కోర్ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్నాయి.
బీఎల్ఏ ఇంటెలిజెన్స్ వింగ్ జిరాబ్ సమన్వయంతో ఈ దాడి జరిగింది.