మాకొద్దీ యుద్ధం.. లక్షల మంది ఉక్రెయిన్ సైనికుల పలాయనం
ఉక్రెయిన్ పరిస్థితి ఏమో కానీ.. రష్యా మాత్రం అద్దె సైనికులను తీసుకుంటోంది. అత్యంత వివాదాస్పద దేశమైన ఉత్తర కొరియాతో పాటు ఇటీవల యెమెన్ సైనికులనూ రంగంలోకి దింపింది.
ఏ యుద్ధమైనా పోరాడేది సైనికులే.. గ్రౌండ్ లో వారే లేకుంటే శత్రువు/ప్రత్యర్థిదే విజయం.. రెండున్నరేళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే సైనికులకు సంబంధించి అనేక కథనాలు వచ్చాయి. లక్షల మంది సైనికులు చనిపోయినట్లుగా, మరికొన్ని లక్షల మంది గాయపడినట్లుగా వార్తలు వినపించాయి. అంటే.. రష్యా.. ఉక్రెయిన్ లది ఒకటే సమస్య అని తెలిసిపోతోంది. కాగా, రష్యా తనకు సైన్యం సరిపోక వివిధ దేశాల నుంచి సైనికులను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ కు చెందిన కొందరు యువకులను ఉద్యోగాల పేరిట రిక్రూట్ చేసుకుంది. అక్కడ పరిస్థితి భరించేలేక యువకులు మొరపెట్టుకోవడంతో భారత ప్రధాని మోదీనే జోక్యం చేసుకున్నారు.
అద్దె సైనికులు
ఉక్రెయిన్ పరిస్థితి ఏమో కానీ.. రష్యా మాత్రం అద్దె సైనికులను తీసుకుంటోంది. అత్యంత వివాదాస్పద దేశమైన ఉత్తర కొరియాతో పాటు ఇటీవల యెమెన్ సైనికులనూ రంగంలోకి దింపింది. అంటే పరోక్షంగా ఇది ప్రపంచ యుద్ధంగా మారుతోంది. ఇక ఉక్రెయిన్ కు సొంత సైన్యమే దిక్కు. ఇతర దేశాల సైనికులను దించే అవకాశం లేదు. అయితే, ఇప్పుడు ఉక్రెయిన్ కు సైనికుల పలాయనం పెద్ద సమస్యగా మారిందట.
రష్యా దూకుడు ముంగిట..
2022 ఫిబ్రవరిలో మొదలైంది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఇటీవలే ఉక్రెయిన్ విద్యుత్తు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది రష్యా. దీంతో చాలా వరకు దేశం చీకట్లో మగ్గింది. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ సైనికులు పారిపోతున్నారట. మరోవైపు రష్యాతో త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ సైనికులు ఇలా పారిపోతే రష్యా ను డిమాండ్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది.
అమెరికా ఒత్తిడితో..
‘అదనపు బలగాలను తీసుకోండి.. 18 ఏళ్లు దాటినవారిని ఎంచుకోడి’ అంటూ ఉక్రెయిన్ పై అమెరికా ఒత్తిడి పెడుతోంది. అయితే, అధికారికంగా లక్షలమంది అనధికారికంగా 2 లక్షల మంది సైనికులు పారిపోయిన పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఏడాది వ్యవధిలోనే 50 వేల మంది ఉక్రెయిన్ సైనికులు కనీసం సెలవు పెట్టకుండా ఇళ్లకో, మరెక్కడికో వెళ్లిపోయారట. ఇప్పుడు 3 లక్షలమంది మాత్రమే సైనికులున్నారు. సర్జరీలు, అనారోగ్య కారణాలను చూపి సెలవు తీసుకున్న సైనికులు మళ్లీ తిరిగిరావడం లేదు.
అటు నుంచి 50 ఫిరంగులు..
ఉక్రెయిన్ సైనికులపై 50 ఫిరంగి గుళ్లు కురుస్తుంటే.. ఇటు నుంచి ఒక్కటే పేల్చగలుగుతున్నారట. రష్యా దాడిలో సహచరులు ముక్కలవుతుంటే తమకూ అదే పరిస్థితి వస్తుంది కదా? అని ఆందోళన చెందుతున్నట్లు ఓ పారిపోయిన సైనికుడు తెలిపాడు. తమను అధికారులు 15 కిలోమీటర్ల వెనుకుండి.. ముందుకెళ్లండంటూ ఉసిగొల్పుతున్నారని.. ఎంతకూ ముగియని ఈ యుద్ధంలో సైన్యం ఓ జైలులా మారిందని సర్జరీ కోసం వెళ్లి తిరిగిరాని మరో సైనికుడు వాపోయాడు.
ఓ పట్టణమే రష్యా వశమైంది..
దాడి చేయడం.. పట్టణాలు, నగరాలను కలిపేసుకోవడం..రష్యా తీరిది. ఇలానే ఉక్రెయిన్ లో పోరాడే సైనికులు లేక ఉహ్లెదార్ పట్టణం రష్యా వశమైంది. 120 మంది ఉండాల్సిన యూనిట్లలో హతులు, క్షతులు, పారరిపోయినవారు పోగా 10 మంది మాత్రమే మిగిలిన సందర్భాలు ఉన్నాయని సమాచారం.