యూపీలో ప్రాణాల 'తోడేలా'.. కనిపిస్తే "ఎన్ కౌంటర్"..

6 తోడేళ్లు.. 30 గ్రామాలు.. 9 మంది షూటర్లు ఉత్తరప్రదేశ్ లోని బహ్రయిచ్ జిల్లా.. అందులోని 30 గ్రామాలు.. ఇప్పుడివి ఒక్క పేరు వింటే హడలెత్తుతున్నాయి.

Update: 2024-09-09 12:30 GMT

అవి సింహాలో.. పులులో కావు.. కనీసం ఇటీవలి కాలంలో జనావాసాల్లోకి వస్తున్న చిరుత పులులు కూడా కావు.. పెద్దగా క్రూర జంతువులూ కావు.. కానీ.. దాదాపు ఆరు నెలలుగా.. ఇంకా చెప్పాలంటే రెండు నెలలుగా మనుషులను పీక్కు తింటున్నాయి. దీంతో ఆపరేషన్ భేడియా (తోడేలు) చేపట్టింది ప్రభుత్వం. ఇప్పటివరకు కరుడుగట్టిన నేరగాళ్లను ఎన్ కౌంటర్ చేసిన చరిత్ర ఉన్న ప్రభుత్వం రంగంలోకి దిగింది.. ఆ జంతువులును ‘ఎన్ కౌంటర్’ చేసేయమని ఆర్డర్ ఇచ్చింది. అయితే, చివరి ప్రయత్నంగా మాత్రమే.

6 తోడేళ్లు.. 30 గ్రామాలు.. 9 మంది షూటర్లు ఉత్తరప్రదేశ్ లోని బహ్రయిచ్ జిల్లా.. అందులోని 30 గ్రామాలు.. ఇప్పుడివి ఒక్క పేరు వింటే హడలెత్తుతున్నాయి. అవే తోడేళ్లు. 8 మంది పిల్లలు సహా 12 మందిని హతమార్చాయి. పదుల సంఖ్యలో ప్రజలను గాయపరిచాయి. దీంతో కనిపిస్తే కాల్చేయమని యోగి సర్కారు 9 మంది షార్ప్ షూటర్లను రంగంలోకి దించింది. 200 మంది అటవీ, పోలీస్ అధికారులను రంగంలోకి దించింది. అయితే, ఇది జరిగి వారం అవుతున్నా.. తోడేళ్ల దండయాత్ర ఆగలేదు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, అటవీ అధికారుల నిఘాకు చిక్కకుండా తప్పించుకుంటున్నాయి.

మనిషి రక్తం రుచిమరిగి..

తోడేళ్లు అడవిలో మాత్రమే మనుషులపై దాడి చేస్తాయి. కానీ ఇప్పుడు ఊళ్లపై పడి రక్తం తాగేస్తున్నాయి. ఇటీవల చనిపోయిన పిల్లల శరీరాలను పరిశీలిస్తే అవి మెడ వద్ద కొరికి రక్తం తాగుతున్నాయి. నర మాంసానికి అలవాటుపడి రాత్రి వేళ దాడులు చేస్తూ పిల్లలను లాక్కెళ్తున్నాయి. ఇప్పుడు అధికారం యంత్రాంగం మొత్తం బహ్రయిచ్‌లోనే పాగా వేసింది. అటవీ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు.

మనుషులపై ప్రతీకారమా...?

తోడేళ్లు తమ ఆవాసాలు, పిల్లలకు హాని జరిగితే సహించవని.. అలా జరగడంతోనే ప్రతీకారానికి దిగాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు. మనుషులపై దాడి వెనుక ఇదే కారణమని అంటున్నారు. వరదలకు ఘఘరా నది ఉప్పొంగి తోడేళ్ల 6 అడుగుల పొడవైన గుహను ముంచింది. దీంతో తోడేళ్ల పిల్లలు చనిపోయాయని.. ఇది మనుషులు చేసిన పనిగా భావించి ప్రతీకారం తీర్చుకుంటున్నాయని అంచనా వేస్తున్నారు. యూపీలో 1996లో ప్రతాప్‌ గఢ్‌ లో పదిమందికిపైగా చిన్నారులపై తోడేళ్లు దాడిచేశాయి. మరికొందరమే.. తోడేళ్లకు ఎక్కడా ఆహారం దొరకనప్పుడు వీధి కుక్కుల కోసం వెదుకుతాయని.. అలాంటప్పుడు మనుషులు కనిపిస్తే పొరపాటున వారిపై దాడి చేస్తాయని చెబుతున్నారు. ఇదే ఇక అలవాటుగా మారిందని పేర్కొంటున్నారు.

మూత్రంతో తడిపిన పిల్లల బొమ్మలు.. ఏనుగు పేడ తోడేళ్లను ఆట కట్టించడానికి పిల్లల బొమ్మలను వారి మూత్రంతో తడపడం, దగ్గరలో ఏనుగు లాంటి పెద్ద జంతువులు ఉన్నాయని భ్రమ కల్పించేందుకు ఏనుగు పేడకు నిప్పటించడం చేస్తున్నారు. ఆపరేషన్ భేడియా కంటిన్యూ అవుతూనే ఉండగా.. ఇప్పుడు నక్కలు ఎంటరయ్యాయి. పిలిభిత్ జిల్లా జహనాబాద్ ప్రాంతంలోని సుస్వార్, పన్సోలి గ్రామాల్లో ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలపై దాడులు చేశాయి. ఐదుగురు చిన్నారులతో సహా కనీసం 12 మంది గాయపడ్డారు.

Tags:    

Similar News