అందమా అందుమా.. మాకే చెందుమా..? భారత్ లో పోటీలు

71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 18 నుంచి మార్చి 9వ తేదీ దాకా ఈ పోటీలు జరగనున్నట్లు సమాచారం

Update: 2024-02-10 09:15 GMT

ఒకరిద్దరు అందగత్తెలు కనిపిస్తేనే కళ్లు తిప్పుకోలేం.. అలాంటిది ప్రపంచంలోని అందగత్తెలంతా ఒకచోట చేరితే..? హొయలొలుకుతూ తమ వయ్యారాల ప్రదర్శనకు దిగితే..? ఇంకేముంది చూసేందుకు కన్నుల పండుగే..? ఇప్పుడు ఇదే జరగబోతోంది.. మరెక్కడో కాదు మన భారత దేశంలోనే.. అది కూడా దాదాపు మూడు దశాబ్దాల తర్వాత జరుగుతున్నాయి.

అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా..

71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 18 నుంచి మార్చి 9వ తేదీ దాకా ఈ పోటీలు జరగనున్నట్లు సమాచారం. ప్రపంచ సుందరి ఎంపిక అంటే మామూలు మాటలు కాదు కదా..? ఢిల్లీలో ప్రారంభ వేడుకలు నిర్వహిస్తారు. ఆపై ముగింపు ముంబైలో ఉంటుంది. ప్రపంచంలో 195 వరకు గుర్తింపు పొందిన దేశాలు ఉన్నప్పటికీ.. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేది 120 దేశాలకు చెందినవారే. ఎందుకంటే.. కొన్ని సంప్రదాయ దేశాలు ఈ పోటీల పట్ల ఆసక్తి చూపవు కాబట్టి. కాగా, భారత్ కు వచ్చే అందగత్తెలు.. వివిధ పోటీల్లో, దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరోవైపు ఢిల్లీలోని అశోకా హోటల్ లో 71వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కోసం ప్రీ ఈవెంట్ లో భాగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత మిస్ వరల్డ్, నలుగురు మాజీ విజేతలు పోటీల 70వ ఎడిషన్ విన్నర్ కరోలినా బిలావ్స్కా, టోనీ అండ్ సింగ్ (69వ ప్రపంచ సుందరి), వెనెస్సా పోన్స్ డీ లియోన్ (68వ ప్రపంచ సుందరి), మానుషి చిల్లర్ (67వ ప్రపంచ సుందరి), స్టెఫానీ డెల్ (66వ ప్రపంచ సుందరి) పాల్గొని కీలక విషయాలను వెల్లడించారు.

అందమే కాదు వ్యక్తిత్వమూ కొలమానం

ప్రపంచ సుందరి పోటీలంటే సుందరీమణుల పోటీలు కాదు. అందం, వైవిధ్యం, సాధికారత మూడింటినీ కలగలిపి విజేతను ఎంపిక చేస్తారు. అంటే మూర్తీభవించిన అందగత్తె లన్నమాట. ఇలాంటి వేడుకలను చూసేందుకు టీవీల ముందు కోట్లాది మంది అతుక్కుపోతారు. భారత్ లో 1996లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. 28 ఏళ్ల తర్వాత మన దేశం వేదికగా నిలుస్తోంది. 1996లో బెంగళూరులో నిర్వహించిన సమయంలో ఓ పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ - సీఈవోగా జూలియా మోర్లీ ఉన్నారు. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఇక్కడ పోటీల నిర్వహణ పట్ల అత్యంత సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఈ దేశాన్ని ఇక్కడి అందమైన ప్రదేశాలను ప్రపంచానికి తెలియజేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వారికి గొప్ప ఆతిథ్యం ఇస్తామని జూలియా ప్రకటించారు. మిస్ వరల్డ్ పోటీల్లో ఈసారి కూడా ఫ్యాషన్ షో, టాలెంట్ కాంపిటీషన్ వంటి సంప్రదాయ రౌండ్ లతో పాటు న్యాయ నిర్ణేతలు అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల ఆధారంగా విజేతను ఎంపిక చేస్తారు.

Tags:    

Similar News