కేరళలో జీవ సమాధి ఘటనలో కీలక పరిణామం!
సమాధిని తవ్విన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
కేరళలోని తిరువనంతపురంలో గోపన్ స్వామి అలియాస్ మణ్యన్ అనే వ్యక్తి జీవ సమాధి అంశం తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన జీవ సమాధి అయ్యారని ఇటీవల ఆయన కుటింబీకులు పోస్టర్లు ప్రచురించారు. ఈ సమయంలో కోర్టు జోక్యంతో ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమాధిని తవ్విన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
అవును... గోపన్ స్వామి అనే వ్యక్తి జీవ సమాధి అయ్యారని చెప్పిన కుటీంబికులు.. బంధువులు, స్థానికులకు తెలియకుండా అతన్ని ఓ దేవాలయం సమీపంలో పూడ్చిచెట్టారు. ఇలా అతన్ని రహస్యంగా పూడ్చి పెట్టడంతో మృతిపై పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో స్పందించిన కుటుంబ సభ్యులు.. అది గోపన్ స్వామి కోరిక అని చెప్పుకొచ్చారు.
ఇందులో భాగంగా... ఎవరూ చూడకుండా తనను సమాధి చేయాలని గోపన్ చెప్పినట్లు ఆయన కుమారులు రాజేశన్, సనందన్ తెలిపారు. ఈ నేపథ్యంలో విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో.. సబ్ కలెక్టర్, తన సిబ్బందితో వెళ్లి సమాధిని తవ్వాలని ఆదేశించారు. అయితే... ఈ పనిని గోపన్ స్వామి భార్యతో పాటు కుమారులూ అడ్డుకున్నారు.
దీంతో.. అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందులో భాగంగా.. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. ఈ ఘటనపై విచారణ జరిపిన హైకోర్టు సమాధిని తవ్వాల్సిందేనని ఆదేశించింది. దీంతో.. మరోసారి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సమయంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఉదయం 7 గంటలకే సమాధి వద్దకు చేరుకున్నట్లు తెలిపారు.
దాన్ని తవ్వడానికి కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్న నేపథ్యంలో.. భారీ భద్రత నడుమ గోపన్ సమాధిని తవ్వారు. సమాధిలో ఆయన మృతదేహం ధ్యాన స్థితిలో ఉందని.. ఛాతి వరకూ పూజా సామాగ్రి నింపి ఉందని తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టు మార్టం నిమిత్తం మెడికల్ కాలేజీకి తరలించినట్లు తెలిపారు.
దీంతో... ఈ పోస్టుమార్టం నివేదికలో ఏ విషయం వెలుగు చూస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇది సహజ మరణమా.. లేక, బలవన్మరణమా.. అదీగాక, హత్య అనే విషయం తెరపైకి రానుందని అంటున్నారు.