పెరట్లో అరుదైన దోమ కుట్టింది... వ్యక్తి మృతి... పెరుగుతున్న కేసులు!
తాజాగా యూఎస్ లో ఓ అరుదైన దోమకాటు ఓ వ్యక్తి ప్రాణం తీసింది.
నీటి బుడగ వంటిది మనిషి జీవితం అంటారు.. ఈ సృష్టిలోని ప్రాణులు అన్నింటికంటే తానే మేధావినని, మిగిలిన సృష్టి మొత్తం తన బానిస అని భ్రమపడుతుంటాడు.. అయితే చిన్న దోమ కాటు కూడా ఊహించని రీతిలో ఒక్క క్షణంలో మనిషి జీవితాన్ని మలుపుతిప్పేస్తుందని, ముగించేస్తుందని మరిచిపోతుంటాడు! తాజాగా యూఎస్ లో ఓ అరుదైన దోమకాటు ఓ వ్యక్తి ప్రాణం తీసింది.
అవును... న్యూ హ్యాంప్ షైర్ నివాసి దోమల ద్వారా సంక్రమించే ఈస్టర్న్ ఈక్విన్ ఎన్ సెఫాలిటిస్ (ఈఈఈ) బారిన పడ్డారని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇలా ఈ దోమకాటు వల్ల వ్యక్తి మృతి చెందడం ఇదే తొలిసారని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ తెలిపింది. ఈ దోమకాటువల్ల వచ్చే వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అంటున్నారు!
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం... రిచర్డ్ పావుల్స్కీ (49) ఆగస్టు 2019లో తన వుడ్స్ ప్రావర్టీలో గార్డెన్ వర్క్ చేస్తున్నప్పుడు ఈస్టర్న్ ఈక్విన్ ఎన్ సెఫాలిటిస్ (ఈఈఈ) బారిన పడ్డారు. ఈ వైరస్ నేరుగా మెదాడుపై దాడి చేస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో... సుమారు ఐదేళ్లుగా చికిత్స పోందుతున్న రిచెర్డ్ సోమవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో మరణించారు.
ఈ విషయాలపై స్పందించిన రిచర్డ్ కుమార్తె... "కంటిరెప్పపాటులో జీవితం మారిపోతుందని నేను చెప్పడం హాస్యాస్పదం కాదు.. ఎందుకంటే మాకు అదే జరిగింది" అని అన్నారు. సోమవారం (అక్టోబర్ 14) న తన తండ్రి మరణించినట్లు వెల్లడించారు!
ఈస్టర్న్ ఈక్విన్ ఎన్ సెఫాలిటిస్ (ఈఈఈ) అంటే ఏమిటి?:
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం... ఈస్టర్న్ ఈక్విన్ ఎన్ సెఫాలిటీస్ అనేది దోమకాటు ద్వారా ప్రజలకు వ్యాపించే వైరస్ వల్ల వస్తుంది. ఇది తీవ్రమైన వ్యాది. ఈ వైరస్ సోకిన వారిలో సుమారు 30% మంది మరణిస్తారని చెబుతున్నారు. ప్రాణాలతో బయటపడినవారికి నాడీ సంబంధిత సమస్యలు కొనసాగుతుంటాయని అంటున్నారు.
జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మూర్చ, మగత మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. ప్రస్తుతానికి ఈ ఈస్టర్న్ ఈక్విన్ ఎన్ సెఫాలిటిస్ ను నిరోధించడానికి టీకాలు, మందులూ లేవు. ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రాంతాల్లో నివసించే ప్రజలు దోమకాటుని నివారించడం ద్వారా ఈ వ్యాధి బరిన పడకుండా రక్షించుకోవాలని చెబుతున్నారు.