రీల్స్ పిచ్చతో.. నోట్లో పాము పెట్టుకొని చచ్చాడు

తాజాగా అలాంటి పనే చేసిన ఒక యువకుడు తన ప్రాణాల్ని తానే తీసుకున్నాడు. రీల్స్ పిచ్చతో పామును నోట్లో పెట్టుకొని వీడియోతీసుకుంటున్న వేళ.. పాము కాటేయటంతో చనిపోయాడు.

Update: 2024-09-07 04:39 GMT

సోషల్ మీడియా మేనియా అందరిని పట్టేస్తోంది. నలుగురిలో ప్రత్యేకంగా ఉండేందుకు వెర్రి ముర్రి పనులు చేస్తున్న ధోరణి. ఈ పిచ్చతో కొన్నిసార్లు అనూహ్య ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా అలాంటి పనే చేసిన ఒక యువకుడు తన ప్రాణాల్ని తానే తీసుకున్నాడు. రీల్స్ పిచ్చతో పామును నోట్లో పెట్టుకొని వీడియోతీసుకుంటున్న వేళ.. పాము కాటేయటంతో చనిపోయాడు.

ఇలాంటి ప్రమాదకర పనులు చేసే వేళలో..కనీసం పాముకున్న విషాన్ని తీసేయాలన్న ఆలోచన కూడా చేయకపోవటం చూస్తే.. రీల్స్ పిచ్చ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషాద ఉదంతం ఎక్కడ చోటు చేసుకుందంటే..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయి పేటకు చెందిన 20 ఏళ్ల శివరాజ్ పాములు పడుతుంటాడు. తన తండ్రి గంగాధర్ ద్వారా పాములు పట్టే నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు. సోషల్ మీడియాలో తనకు చెందిన రీల్స్ ను షూట్ చేస్తుంటాడు. గురువారం ఊళ్లో ఒక చోట నాగుపాము ఉందని ఫోన్ చేయటంతో అక్కడకు వెళ్లాడు.

దాన్ని పట్టుకున్నాడు. అక్కడితో ఆగని అతడు.. చాలాసేపు దానితో ఆడుతూ విన్యాసాలు చేశాడు. పాము తలను నోట్లో పెట్టుకొని వీడియోలు తీయించుకున్నాడు. ఈ క్రమంలో నోట్లో పామును పెట్టుకొని ఆటలాడాడు. ఈ క్రమంలో సదరు పాము.. అతని చేతి వేలి మీద కాటేసింది. దీంతో.. ఇంటికి వచ్చిన అతను.. జరిగింది ఇంట్లో వాళ్లకు చెప్పాడు.

వెంటనే అతడ్ని బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో.. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చేతికి అంది వచ్చిన కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటం.. అది కూడా ప్రమాదకర ఆటల్ని అందరికి చూపించాలన్న ఆత్రుతలో చనిపోవటం గమనార్హం. రీల్స్ చేసే వారు.. ప్రమాదకర పరిస్థితులను గుర్తించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. వారి రీల్స్ ఏమో కానీ.. వారి ప్రాణాలు మాత్రం ఉండవన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Tags:    

Similar News