ఓటును ఆధార్ తో లింక్ చేస్తారా ?
ఎన్నికలు ఏదైనా ప్రధాన సమస్య దొంగఓట్లు. వేలు, లక్షల్లో నమోదవుతున్న దొంగఓట్లు, పోలింగ్ కేంద్రాల దగ్గర దొంగఓట్లంటు పార్టీలు నానా గోలచేస్తాయి
ఎన్నికలు ఏదైనా ప్రధాన సమస్య దొంగఓట్లు. వేలు, లక్షల్లో నమోదవుతున్న దొంగఓట్లు, పోలింగ్ కేంద్రాల దగ్గర దొంగఓట్లంటు పార్టీలు నానా గోలచేస్తాయి. ఇదే పద్దతి దశాబ్దాలుగా జరుగుతున్నా దీనికి చెక్ పెట్టేందుకు మాత్రం ఎన్నికల కమీషన్ ప్రయత్నించటంలేదు. దొంగఓట్లన్నది నివారించలేనంత పెద్ద సమస్యేమీ కాదు. కాకపోతే పార్టీల్లో, అధికార యంత్రాంగంతో పాటు ఎన్నికల కమీషన్లో చిత్తశుద్ది ఉండాలి. రాజకీయపార్టీల్లో ఎటూ చిత్తశుద్ది ఉండదు కాబట్టి ముందడుగు వేయాల్సింది ఎన్నికల కమీషన్ మాత్రమే.
ఒకపుడు దొంగఓట్లను పట్టుకోవటం, ఏరేయటం, నివారించటం కష్టమని అనుకున్నా అర్ధముంది. కానీ ఇఫుడు చాలా తేలికైపోతోంది. ఎలాగంటే దేశంలోని 95 శాతం జనాలకు ఆధార్ కార్డులున్నాయి. వాటిని వాళ్ళ ఓటరుకార్డుతో లింకుచేస్తే దొంగఓట్లకు చెక్ పడుతుంది. మొబైల్ నెంబర్ మారచ్చేమో కానీ ఆధార్ కార్డు నెంబర్ మాత్రం ఎప్పటికీ మారదు. అందుకనే ఓటును ఆధార్ కార్డుతో జతచేసేస్తే చాలా సమస్యలు పరిష్కారమైపోతాయి.
ఇపుడు ఏపీ విషయమే తీసుకుంటే దొంగఓట్లపై చంద్రబాబునాయుడు, వైసీపీ నేతలు పోటీలుపడి కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఓటును ఆధార్ కార్డుతో లింకు చేయాలని సూచించాయి. రెండు ప్రధాన పార్టీలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి ప్రయోగాత్మకంగా ఓటును ఆధార్ తో లింకుచేయాలి. దాని ఫలితం ఎలాగుంటుందో అధ్యయనం చేయాలి. అప్పుడు కూడా ఏవైనా లోపాలు బయటపడితే దాన్ని తర్వాత సరిచేసుకోవచ్చు.
దొంగఓట్ల నమోదుకు మీరే కారణమంటే కాదు మీరే కారణమని వైసీపీ, టీడీపీ ఒకదానిమీద మరోటి ఫిర్యాదు చేసుకుంటున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే దొంగఓట్ల నమోదులో రెండు పార్టీలు సమానమే. టీడీపీ హయాంలో నమోదుచేయించిన 60 లక్షల దొంగఓట్లను ప్రభుత్వం ఇపుడు ఏరేస్తున్నట్లు వైసీపీ వాదిస్తోంది. ఇదే సమయంలో టీడీపీకి పడతాయని అనుమానమున్న ఓట్లను ప్రభుత్వం తొలగిస్తోందని టీడీపీ పదే పదే ఆరోపిస్తోంది. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఆధార్ ను ఓటుతో లింక చేయటం ఒకటే మార్గం. ఇప్పటికైనా ఎన్నికల కమీషన్ ముందడుగు వేస్తుందా ? ఏమో చూడాల్సిందే.