ట్రక్కు డ్రైవర్ గల్లా పట్టిన గంభీర్.. అతడితో పెట్టుకుంటే అంతే
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా బహుశా 43 ఏళ్ల అత్యంత చిన్న వయసులో బాధ్యతలు చేపట్టడం అంటే మాటలు కాదు.. కేవలం ప్రతిభ ఒక్కటే సరిపోదు.. దీనికి క్రమశిక్షణ కూడా తోడవ్వాలి.
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా బహుశా 43 ఏళ్ల అత్యంత చిన్న వయసులో బాధ్యతలు చేపట్టడం అంటే మాటలు కాదు.. కేవలం ప్రతిభ ఒక్కటే సరిపోదు.. దీనికి క్రమశిక్షణ కూడా తోడవ్వాలి. అందరినీ కలుపుకొనిపోయే నాయకత్వ సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు రిటైర్ మెంట్ కు దగ్గరగా ఉన్న సమయంలో భారత జట్టును అతడి చేతిలో పెట్టారు. అయితే, గంభీర్ ఎంతటి మేటి ఆటగాడో అంతటి ముక్కుసూటి అనే సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదితో మైదానంలోనే గొడవకు దిగాడు. అతడు ప్రత్యర్థి ఆటగాడు కాబట్టి సరిపెట్టుకుందా.. కానీ, స్టార్ క్రికెటర్, తన రాష్ట్రానికే చెందిన విరాట్ కోహ్లీతోనూ గంభీర్ వాదులాడాడు. దీన్నిబట్టే చెప్పొచ్చు అతడు ఎంత నిక్కచ్చో...?
క్రీడలు.. రాజకీయం.. క్రీడలు..
గంభీర్ ప్రత్యేకత ఏమంటే ఎక్కడకు వెళ్లినా విజయం సాధించడం. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ లో అతడి ఇన్నింగ్స్ లే భారత జట్టును చాంపియన్ గా నిలిపాయి. మరోవైపు 2012, 2014లో గంభీర్ కెప్టెన్సీలోనే కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చాంపియన్ గా నిలిచింది. 2024లో గంభీర్ మెంటార్ గానూ టైటిల్ కొట్టింది. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ నూ గంభీర్ మంచి జట్టుగా తీర్చిదిద్దాడు. ఇదే క్రమంలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ అయ్యాడు. కాగా, గంభీర్ గురించి ఎవరికీ తెలియని మరో విషయాన్ని భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా బయటపెట్టాడు.
ట్రక్ డ్రైవర్ నూ వదల్లేదట
గంభీర్ ఓసారి ట్రక్కు డ్రైవర్ తోనూ గొడవపడ్డాడని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఆకాశ్.. గంభీర్ తో పాటే ఢిల్లీకి ఆడాడు. గంభీర్ కంటే కొద్దిగా ముందు జాతీయ జట్టులోకి వచ్చాడు. అయితే, విఫలం కావడంతో చోటు నిలవలేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఆకాశ్ చోప్రా స్థానంలోకే గంభీర్ వచ్చాడు. ఇక గంభీర్ ట్రక్ డ్రైవర్ తో గొడవ పడిన తాజా విషయానికి వస్తే.. ట్రక్ డ్రైవర్ రాంగ్ రూట్లో వచ్చాడట. పైగా గంభీర్ పైనే నోరు పారేసుకున్నాడట. దీంతో గంభీర్ కోపంతో ఊగిపోయాడని.. ఏకంగా ట్రక్ లోకి వెళ్లి డ్రైవర్ కాలర్ పట్టుకున్నాడని ఆకాశ్ చోప్రా తెలిపాడు. తేడా వస్తే గంభీర్ తో అలాగే ఉంటుందని కూడా వివరించాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
తన జోలికి వస్తేనే..
గంభీర్ దూకుడు స్వభావి. అది మైదానంలో అయినా, బయట అయినా అంతే. అది కూడా తన జోలికి వస్తేనే అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. అంతెందుకు? ఇదే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఆడాడు గంభీర్. కానీ, వీరిద్దరూ ఎప్పుడూ వాదనకు దిగలేదు. దీన్నిబట్టే చెప్పొచ్చు గంభీర్ తనకు ఇబ్బంది కలిగితేనే, ఏదైనా జరగాల్సిన దానికి భిన్నంగా జరిగితేనే గొడవపడతాడని.