ఇండియా కూటమికి ఆదిలోనే హంసపాదు!

ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కీలక పార్టీల్లో ఒకటైన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూటమికి తీవ్ర షాక్‌ ఇచ్చింది

Update: 2023-08-28 06:23 GMT

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయడానికి దాదాపు 28 పార్టీలు 'ఇండియా' పేరుతో కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ పార్టీలన్నీ ఇప్పటికే సంయుక్తంగా రెండు సమావేశాలు నిర్వహించాయి. మూడో సమావేశాన్ని ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1న ముంబైలో నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కీలక పార్టీల్లో ఒకటైన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూటమికి తీవ్ర షాక్‌ ఇచ్చింది. బిహార్‌ లో 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్య నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సందీప్‌ పాఠక్‌ ప్రకటించడం కూటమిలో కాకరేపుతోంది.

ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆప్‌ జనరల్‌ సెక్రటరీ సందీప్‌ పాఠక్‌ సమావేశం నిర్వహించారు. ఢిల్లీకి చెందిన ఆప్‌ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ బిహార్‌ ఇంచార్జి్జ అజేష్‌ యాదవ్‌లు ఈ మీటింగ్‌ లో పాల్గొన్నారు. ఆగస్టు నెలాఖరున ముంబైలో ఇండియా కూటమి నిర్వహించనున్న కీలక సమావేశానికి ముందు ఆప్‌ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

బిహార్‌ లో ఆమ్‌ ఆద్మీ పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేయాలని సందీప్‌ పాఠక్‌ తమ నాయకులకు సూచించారు. నీచ రాజకీయాల కారణంగానే బిహార్‌ అభివృద్ధి చెందడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఆప్‌ తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుందని, అంతకుముందే పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గుజరాత్‌ లో పోటీ చేసినట్టుగానే 2025లో జరిగే బిహార్‌ అసెంబ్లీ ఎన్నిక్లోనూ పూర్తి స్థాయిలో పోటీ చేస్తామని పాఠక్‌ తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయగానే తదుపరి ప్రణాళికలను వెల్లడిస్తామన్నారు. ఈ క్రమంలో ముందుగా బిహార్‌లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు.

ప్రస్తుతం బిహార్‌ లో జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ సర్కారు అధికారంలో ఉంది. జనతాదళ్‌ యునైటెడ్‌ అధినేత నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్రీయ జనతాదళ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తేజస్వీ యాదవ్‌ ఉన్నారు. జేడీయూ, ఆర్జేడీ రెండూ ఇండియా కూటమిలో ఉండటం విశేషం. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఇదే కూటమిలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బిహార్‌ ఎన్నికల్లో ఆప్‌ పోటీ చేస్తే జేడీయూ–ఆర్జేడీ ఓటు బ్యాంకుకు చిల్లుపడటం ఖాయం.

ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడు ''అభిప్రాయాలు వేరు.. దేశమే ప్రధానం.. కూటమిలు తర్వాత'' అని సందీప్‌ పాఠక్‌ చెప్పడం గమనార్హం. ఆప్‌ జాతీయ పార్టీ అయిన ఎక్కడైనా పోటీ చేయవచ్చని ఆయన తెలిపారు.

మరోవైపు బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆప్‌ నిర్ణయంపై ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ స్పందించారు. ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నప్పుడే కొన్ని కట్టుబాట్లను పెట్టుకున్నామని గుర్తు చేశారు. ఈ విధివిధానాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆప్‌ కూడా కూటమి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలిని సూచించారు.

మరోవైపు పార్టీని విస్తరించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని జేడీయూ నాయకుడు నీరజ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. తాము (జేడీయూ) కూడా ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తామని చెప్పారు. కూటమి పార్టీలన్నీ ఏకంగా పోటీచేస్తాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా ఇతర నాయకులు చెప్పారని గుర్తు చేశారు. తమ కూటమిలో ఉన్న అంతర్గత అభిప్రాయ భేదాలను క్రమంగా పరిష్కరించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News