30 మంది పోలీసుల రక్షణతో జైలు నుంచి వచ్చి.. ఆ నేత ఏం చేశాడంటే!
ఆయన చుట్టూ 30 మందికి పైగా ఉన్నతాధికారులతో కూడిన పోలీసు భద్రత. ఎవరినీ దగ్గరకు కూడా వెళ్లనీయకుండా.. కంటికి రెప్పలా కాచుకునే పోలీసులు
ఆయన చుట్టూ 30 మందికి పైగా ఉన్నతాధికారులతో కూడిన పోలీసు భద్రత. ఎవరినీ దగ్గరకు కూడా వెళ్లనీయకుండా.. కంటికి రెప్పలా కాచుకునే పోలీసులు. అలా.. వచ్చిన ఆయన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ వేసి వెళ్లారు. అయితే.. ఆయనేమీ అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న నాయకుడు కాదు. జైల్లో ఉన్న రాజకీయ నేత. అది కూడా దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు అరెస్టు చేసి జైల్లో పెట్టిన ఆప్ నాయకుడు. ఆయనే సంజయ్ సింగ్.
ఢిల్లీ పరిధిలో ఖాళీ అయిన.. మూడు రాజ్యసభ స్థానాలు.. సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉండడంతో ఆ పార్టీకే దక్కాయి. ఈ క్రమంలో ఇతర నేతలు ఈ స్థానాలు ఆశించినా.. కేజ్రీవాల్ మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. లిక్కర్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న సంజయ్ సింగ్ సహా యూపీకి చెందిన మరో ఇద్దరు నాయకులకే తిరిగి ఈ స్థానా ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు పార్టీలోనూ అందరినీ ఒప్పించిన సీఎం కేజ్రీవాల్.. ఏకంగా లిక్కర్ కేసులో జైల్లో ఉన్న సంజయ్ సింగ్‌కే నేరుగా నామినేషన్ పత్రాలను పంపించారు.
ఇక, అక్కడే పూర్తి చేసిన ఆప్ నేత సంజయ్‌సింగ్.. వాటిని మాత్రం ప్రత్యక్షంగా ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉండడం తో జైలు అధికారులకు దరఖాస్తు పెట్టుకుని..ఏకంగా 30 మంది పోలీసుల భద్రత నడుమ నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ సింగ్ భార్య.. ఆయనను కలుసుకున్నారు. కానీ, మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే.. పార్టీ కార్యకర్తలను కలిసిన తర్వాత సంజయ్ సింగ్‌లో ఉత్తేజం పెరిగినట్టు ఆమె పేర్కొన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, జైలు నుంచి త్వరలోనే తన భర్త బయటకు వస్తారని ఆమె వ్యాఖ్యానించారు.