వాటే తమాషా : కాంగ్రెస్ వద్దుంటున్న గవర్నర్ వ్యవస్థ !

రాజ్యసభకు తాజాగా తెలంగాణా నుంచి నెగ్గిన అభిషేక్ సింఘ్వీ అయితే గవర్నర్ వ్యవస్థను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Update: 2024-09-03 07:30 GMT

గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని గతంలో ఎన్నో ప్రభుత్వాలను కాంగ్రెస్ కూలగొట్టింది. ఇది చరిత్ర పుటలలో అత్యంత పదిలంగా ఉంది. గవర్నర్లను రాజ్ భవన్ లో ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం తన ప్రతినిధిగా కాకుండా కాంగ్రెస్ తన మనుషులుగా వాడుకోవడం ఒకనాడు జరిగింది. దానికి అచ్చమైన సాక్ష్యం ఉమ్మడి ఏపీలో అన్న నందమూరి తారక రామారావు ప్రభుత్వం. ఆయన ప్రభుత్వాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా ఒక్క దెబ్బకు కూల్చేశారు. దాని ఫలితంగా 1984లో వచ్చిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం దేశ చరిత్రలోనే ఒక కీలకమైన మలుపు అని చెప్పాలి.

దాని వల్ల మళ్లీ ఎన్టీఆర్ ప్రభుత్వం బతికి బట్ట కట్టింది. అలా చేయలేకపోవడం వల్ల అదే సమయంలో కాశ్మీర్ లో ఫరూఖ్ అబ్దుల్లా ప్రభుత్వం కుప్ప కూలి మళ్లీ లేవలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ముందు 1960 దశకంలోనూ ప్రభుత్వాలను కూల్చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో అదొక ఒరవడిగా మారింది.

ఆనాడు బాధితురాలిగా ఉన్న బీజేపీ తాను అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థను చక్కదిద్దాల్సినది పోయి అదే ఆట ఆడడం నేర్చింది అన్న విమర్శలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ విషయంలో కాంగ్రెస్ కంటే నాలుగు ఆకులు ఎక్కువగా బీజేపీ చదివింది అన్న విమర్శలు కూడా ఉన్నాయి.

బీజేపీ గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా తమకు అనుకూలంగా చేసుకుంటున్నారు అని కాంగ్రెస్ పెద్దలు ఆరోపిస్తున్నారు. రాజ్యసభకు తాజాగా తెలంగాణా నుంచి నెగ్గిన అభిషేక్ సింఘ్వీ అయితే గవర్నర్ వ్యవస్థను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

వివిధ రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలలో వేలు పెడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. అందువల్ల గవర్నర్ వ్యవస్థను రద్దు చేయడం ఉత్తమమని ఆయన తనదైన విలువైన సూచనలు చేశారు. అలా కాదు అనుకుంటే మాత్రం న్యూట్రల్ గా ఉండేవారిని గవర్నర్లుగా నియమించాలని మరో సూచన చేశారు.

దేశంలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడులలో గవర్నర్లకు ప్రభుత్వాలకు మధ్య వివాదాలు చెలరేగుతున్న కీలకమైన నేపధ్యంలో అభిషేక్ సింఘ్వీ చేసిన ఈ కీలకమైన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారని వారు చేసే బిల్లులను గవర్నలు ఆమోదించకుండా చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఆయన ఒక తాజా ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయా ప్రభుత్వాలతో విభేదాలు ఉన్న గవర్నలను వెంటనే తప్పించాలని కూడా ఆయన కోరారు.

ఇక దేశంలో చట్టసభలలో స్పీకర్లు కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలని ఆయన అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సింఘ్వీ ఈ అభిప్రాయానికి రావడం చూస్తే వాటే పాలిటిక్స్ తమాషా అనిపించకమానదు. బీజేపీ అయితే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని అంటుందేమో. ఎవరు ఈ విధానాన్ని తెచ్చారు అన్నది కాదు మంచి అయితే పాటించాలి చెడు అయితే విసర్జించాలి.

కానీ రాజకీయం కోసం తాము చేస్తూ ప్రత్యర్ధులను ఆ వికృత క్రీడలో జొప్పిస్తూ అందులో పై చేయి సాధిస్తూ ఎవరు చేసినా తప్పే. అయినా గవర్నర్ విధానం మీద ఇప్పటికైనా పెద్ద డిబేట్ దేశంలో సాగాల్సి ఉంది. ఆ వ్యవస్థను ఉంచాలా లేదా అన్నది అన్ని పార్టీలు కలసి కూర్చుని ఒక నిర్ణయానికి రావడం బెటర్.

Tags:    

Similar News