వైద్యురాలిపై అత్యాచారంలో బిగ్‌ ట్విస్ట్‌!

కాగా హత్యాచారానికి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

Update: 2024-08-13 04:52 GMT

కోల్‌ కతాలోని ఆర్జీ కార్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఒక జూనియర్‌ డాక్టర్‌ పై దారుణ అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జూనియర్‌ డాక్టర్‌ మృత్యువాత పడింది. ఆమె నోరు, పెదవులు, మర్మాంగాలు, ఇతర ప్రైవేట్‌ పార్ట్స్‌ లో రక్తస్రావం జరగడంతో ఆమె మరణించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ హత్యాచారానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, రాత్రిళ్లు విధులు నిర్వహించే వైద్యులకు భద్రత కల్పించాలని కోరుతూ అఖిల భారత జూనియర్‌ డాక్టర్ల సంఘం, వైద్యుల అసోసియేషన్లు నిరసనలకు పిలుపునిచ్చాయి.

మరోవైపు జూనియర్‌ డాక్టర్‌ పై హత్యాచారం వ్యవహారానికి సంబంధించి కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. విద్యార్థుల నిరసనలతో కళాశాల ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌ సైతం రాజీనామా బాట పట్టారు.

కాగా హత్యాచారానికి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మొదట వైద్యురాలిని చంపి ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.

ఆర్జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేసిన నిందితుడు సంజయ్‌ రాయ్‌ ఆ తర్వాత తాను ఉండే ప్రాంతానికి వచ్చి హాయిగా నిద్రపోయినట్టు పోలీసులు వెల్లడించారు. అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని తెలిపారు. తానే అత్యాచారం చేసినట్టు అతడు అంగీకరించాడని చెప్పారు. కావాలంటే తనను ఉరి తీయాలని కూడా చెప్పినట్టు చెబుతున్నారు.

జూనియర్‌ డాక్టర్‌ ను హత్యాచారం చేశాక ఇంటికి తిరిగొచ్చిన అతడు అలాగే రక్తపు మరకలు అంటిన దుస్తులతోనే నిద్రించాడని పోలీసులు తెలిపారు. ఉదయాన్నే నిద్ర లేచాక తన దుస్తులపై రక్తపు మరకలను తుడిచేయడానికి వాటిని ఉతుక్కున్నాడని వివరించారు. అయితే అతడి బూట్లుకు అంటిన రక్తపు మరకలు, సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

పౌర వాలంటీర్‌ అయిన నిందితుడికి ఈ ఆస్పత్రితో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు. అప్పుడప్పుడు మాత్రమే అతడు ఆస్పత్రికి వస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు.

మరోవైపు కోల్‌ కతా సిటీ పోలీసు కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ మెడికల్‌ కళాశాలను వరుసగా రెండో రోజు కూడా పరిశీలించారు. నిరసన దీక్ష చేస్తున్న వైద్యులతో సమావేశమై వారికి భరోసా ఇచ్చారు. విచారణను పారదర్శకంగా చేస్తున్నామని చెప్పారు. హత్యాచారంలో ఇంకెవరి పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. బాధితురాలి పోస్టుమార్టం నివేదిక కోసం తాము ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. ఘటనకు సంబంధించి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేపట్టినట్లు వివరించారు.

కాగా నిందితుడు సంజయ్‌ రాయ్‌ సెల్‌ ఫోన్‌ నిండా అశ్లీల వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతడికి నాలుగు పెళ్లిళ్లు జరిగినట్టు చెబుతున్నారు.

హత్యాచార ఘటనకు ముందు బాధితురాలు సహోద్యోగులతో కలిసి డిన్నర్‌ చేశారని.. ఆ తర్వాత ఒలింపిక్స్‌ లో జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా తలపడుతుండటంతో అది చూశారని సహోద్యోగులు తెలిపారు. ఆ తర్వాత ఆమె తన తల్లికి ఫోన్‌ చేసి మాట్లాడారని వెల్లడించారు.

కాగా హత్యాచార ఘటనలో దోషులెవరో పోలీసులు తేల్చలేకపోతే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.

Tags:    

Similar News