కొత్త ఏడాదిలోనూ కేసీఆర్ జగన్ గురించే !
అనేక రంగాలలో పరిస్థితులు మంచి చెడ్డలు గురించి సమీక్షలు నిర్వహిస్తున్నారు.
కొత్త ఏడాదిలోకి ప్రపంచం అంతా అడుగు పెట్టింది. సంబరాలు చేసుకుంటూ న్యూ ఇయర్ ని అంతా ఘనంగా ఆహ్వానం పలుకుతున్నారు. అనేక రంగాలలో పరిస్థితులు మంచి చెడ్డలు గురించి సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాజకీయాలు కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.
కొత్త ఏడాది ఎలా ఉంటుంది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరు ఏమేమి చేయబోతున్నారు అన్నది చర్చగా ఉంది. 2023 పోతూ పోతూ కేసీఆర్ కి బీఆర్ఎస్ కి గట్టి ఝలక్ ఇచ్చేసింది. ఆయన పదేళ్ళ అధికారాన్ని దిగ లాగేసింది. ఇక 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆ దెబ్బ మరింత గట్టిగా తగిలింది. లోక్ సభలో బీఆర్ఎస్ కి ఒక్క సీటూ రాకుండా దారుణమైన ఫలితం వచ్చింది.
అలా 2024 బీఆర్ఎస్ కి మరింత చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అంతే కాదు ఇదే ఏడాది కేసీఆర్ తనయ కవిత అరెస్ట్ అయి ఆరు నెలల పాటు తీహార్ జైలులో ఉండటం, ఏడాది చివరిలో కేటీయార్ మీద ఏసీబీ ఈడీ కేసులు నమోదు కావడం జరిగిపోయాయి. ఈ మధ్యలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుల మీద కేసులు అదనంగా చెప్పుకోవాలి.
దాంతో ఎంత వేగంగా ఈ ఇయర్ గడిస్తే చాలు అన్న ఆతృత ఆ పారీ వాదులలో కనిపించింది. ఇక కేసీఆర్ 2024లో ఒకే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు. అది కూడా బడ్జెట్ సెషన్ కి మాత్రమే. ఆ తరువాత ఆయన మళ్ళీ కనిపించింది లేదు. ఇక ఇయర్ ఎండింగ్ లో ప్రత్యేక సమావేశం పెట్టి దేశానికి ఆర్ధిక సంస్కరణలు తెచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి నివాళి అర్పించే సభకు కూడా కేసీఆర్ వెళ్లలేదు.
దాంతో కేసీఆర్ 2024లో ఒకే ఒక్క రోజు కొంత సేపు మాత్రమే అసెంబ్లీలో గడిపిన సీనియర్ ఎమ్మెల్యేగా రికార్డుని సాధించారు. 2025లో కేసీఅర్ ఏమి చేస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన అసెంబ్లీకి వస్తే చూడాలని అంతా కోరుకుంటున్నారు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తాలని కూడా అంతా అంటున్నారు.
ఇక ఏపీలో చూస్తే వైసీపీ అధినేత 2024లో అసెంబ్లీలో డ్యులర్ రోల్ పోషించారు అని చెప్పాలి. తొలి అర్ధ భాగం ఆయన సీఎం గా ఉన్నారు. ఓటాన్ అకౌంట్ సభకు సమర్పించడం వరకూ సీఎం గానే హాజరయ్యారు. ఆ తరువాత ఎన్నికలు రావడం వైసీపీ దారుణంగా పరాజయం పాలు అయి 11 సీట్లకే పరిమితం కావడం వంటివి జరిగిపోయాయి.
జగన్ రెండవ అర్ధ భాగంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రెండే సందర్భాలలో సభకు వచ్చారు. మొదటిది ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి, రెండవది కొత్త సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసినపుడు. ఆ తరువాత జగన్ సభకు నమస్కారం అనేశారు. ఇటీవల బడ్జెట్ సమావేశాలు జరిగినపుడు కూడా జగన్ హాజరు కాలేదు దాంతో దాని మీద చర్చ ఒక లెవెల్ లో సాగింది.
దీంతో 2025లో బడ్జెట్ సెషన్ ఉంది. అలాగే మరో రెండు సార్లు సభ సమావేశం కానుంది. అలా ఏపీ అసెంబ్లీ కనీసంగా ముప్పయి నుంచి నలభై రోజుల పాటు జరగనుంది. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. 2025లో అసెంబ్లీకి వస్తే చూడాలని అంతా కోరుకుంటున్నారు.
తొలి ఏడాది జగన్ సభకు వెళ్లకపోయినా ఫర్వాలేదు కానీ ఇపుడు కూటమి ప్రభుత్వం ఏడు నెలలు పూర్తి చేసుకుని ఏడాది పాలన పూర్తి వైపుగా సాగుతోంది. దాంతో ప్రజా సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. విపక్షంలో కేవలం వైసీపీ మాత్రమే ఉంది. దాంతో వైసీపీ మీద 2025లో గురుతర బాధ్యత ఎక్కువగా ఉంటుందని అంతా అంటున్నారు.
మరి జగన్ పట్టు విడుపులు విడిచి పెట్టి సభకు వెళ్తారా అన్నది కొత్త ఏడాది తొలి రోజే మొదలైపోయింది. సభకు వెళ్ళి అధికార పక్షాన్ని నిలదీస్తేనే వైసీపీకి అవసరమైన పొలిటికల్ మైలేజ్ దక్కుతుందని అంటున్నారు. అలా కాకుండా సభకు దూరంగా ఉంటే మాత్రం ఇబ్బందే అంటున్నారు అదే విధంగా కేసీఆర్ కూడా సభకు వచ్చి తన బాధ్యతలను నిర్వహించాలని అక్కడా కోరుకుంటున్నారు. మరి కొత్త ఏడాది ఈ రెండు పార్టీల అధినేతలు తీసుకున్న రిజల్యూషన్స్ ఏమిటో కాలమే చెబుతుంది.