ఏపీ పాలిటిక్స్‌లో కొత్తా దేవుడండీ.. ఏపీకి కొత్త నేత ఏబీవీ.. !

రాష్ట్రంలో కొత్త రాజ‌కీయ నేత రానున్నారు. తానే స్వ‌యంగా ప్ర‌క‌టించిన‌ట్టు ఇప్ప‌టికే ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసే ఉంటారు.;

Update: 2025-04-14 05:42 GMT
ABV Emerges as New Political Leader in AP

రాష్ట్రంలో కొత్త రాజ‌కీయ నేత రానున్నారు. తానే స్వ‌యంగా ప్ర‌క‌టించిన‌ట్టు ఇప్ప‌టికే ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసే ఉంటారు. ఆయ‌నే ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆలూరి బాల వెంక‌టేశ్వ‌ర‌రావు ఉర‌ఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర రావు. దీంతో ఏపీలో ఆయ‌న‌ప‌ర్వం ప్రారంభం కానుంది. వ‌స్తూ వ‌స్తూనే ఆయ‌న ఏం చేస్తార‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ల‌క్ష్యం-కార్యం.. అన్నీ ఆయ‌న మాట‌ల్లోనే స్ప‌ష్టంగా క‌నిపించాయి. జ‌గ‌న్‌-జ‌గ‌న్‌-జ‌గ‌న్ ఈ మూడు నినాదాల‌తోనే ఆయ‌న రానున్నారు. జ‌గ‌న్ కేంద్రంగా పోరాటం చేసేందుకు ప్ర‌త్యేకంగా ఆయ‌న రంగంలోకి దిగుతున్న సంకేతాలు ఇచ్చేశారు.

ప్ర‌స్తుతం ఏబీవీ ఏ పార్టీలో చేర‌నున్నారు? అనేది కూడా ఆస‌క్తిగానే ఉంది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. అయితే, టీడీపీ, లేక‌పోతే జ‌న‌సేన ఈ రెండు పార్టీల్లోనే ఏబీవీకి స్వేచ్ఛ‌, ఇత‌రత్రా అవకాశాలు క‌నిపిస్తున్నాయి. పైగా.. ఆయ‌న ఎంచుకున్న ల‌క్ష్యం కూడా.. నెర‌వేరాలంటే..(జ‌గ‌న్‌ను ఢీకొట్టే వ్యూహం) ఆయ‌న ఈ రెండు పార్టీల‌కు మిన‌హా బీజేపీలో చేరితే అయ్యే ప‌నికాదు.ఇక‌, ఏబీవీ చెప్పిన సారాంశం ప్ర‌కారం.. ఆయ‌న జ‌గ‌న్ అక్ర‌మాల‌ను, అవినీతిని, వైసీపీ ఏలుబ‌డిలో జ‌రిగిన దుర్మార్గాల‌ను వెలికి.. తీస్తాన‌ని చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ ప్ర‌భుత్వం కూడా.. ఇదే చేసిన ద‌రిమిలా.. ఆయ‌న ఏం చేస్తార‌న్న‌ది చూడాలి.

అయితే.. ఏబీవీ ద్వారా.. జ‌గ‌న్‌పై నిరంత‌రం.. గ‌తంలో ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మాదిరిగా యుద్ధం చేసే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో ర‌ఘురామ కూడా.. నిరంత‌రం ... జ‌గ‌న్ త‌ప్పులు ఎత్తి చూపుతూ.. సోష‌ల్ మీడియా స‌హా.. ఇత‌ర ప్ర‌ధాన మీడియాల్లోనూ చ‌ర్చ‌ల‌కు వ‌చ్చారు. ఇప్పుడు ఏబీవీ కూడా అదే పాత్ర‌ను దాదాపు పోషించే అవ‌కాశం ఉంటుంది. ఇక‌, చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగు పెడ‌తారా? పెట్ట‌రా? అనేది ఆయ‌న చేరే పార్టీని బ‌ట్టి.. ఆయ‌న వేసే అడుగుల‌ను బ‌ట్టి ఉంటుంది. ఇప్ప‌టికిప్పుడు ఈ విష‌యంపై తేల్చే ప‌రిస్థితి లేదు.

కానీ, జ‌గ‌న్ కేంద్రంగా రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటున్న నేప‌థ్యంలో ఏబీవీ పాత్ర‌ను హైలెట్ చేసేందుకు మీడియా కూడా సిద్దంగానే ఉంటుంది. సో.. ఆయ‌న పాత్ర ప‌రిమితం కాదు.. అప‌రిమిత‌మ‌నే చెప్పాలి. అయితే.. ఇలాంటి వారిని జ‌గ‌న్ చాలా మందే చూశారంటూ..ఏబీవీ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. వైసీపీ నుంచి విసుర్లు వ‌చ్చాయి. జ‌గ‌న్ ఇలాంటి వారితోనే కాదు.. ఎంతో మందితో పోరాడిన ధీశాలి అంటూ.. మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించేశారు. సో.. వైసీపీ కూడా రెడీ అయిపోయింది. ఇక‌, రాజకీయంగా చూసుకుంటే..ఏబీవీని అనుస‌రించేవారు ఎవ‌రు? ఆయ‌న విధానాల‌తో పొసిగేది ఎవ‌రికి అనేది తేలాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఏబీవీ రాక మాత్రం ఖాయ‌మైనా.. ఆయ‌న ఎంచుకు పంథాలో ఎంత దూరం వెళ్తారు? ఎలా విజ‌యం ద‌క్కించుకుంటార‌న్న‌ది మాత్రం చూడాలి.

Tags:    

Similar News