స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు.. ఏం జరిగిందంటే
అంతేకాదు.. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, సీఐడీ అధికారుల స్వేచ్ఛ, భద్రతకు భంగం కలుగుతుందని వాదనలు వినిపించిన సీఐడీ తరఫున న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.
స్కిల్ కార్పొరేషన్ కేసులో అరెస్టయి.. 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు తాజాగా మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే.. ఈకేసుకు సంబంధించి తనను అరెస్టు చేసిన సమయంలో సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ.. చంద్రబాబు కోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ డేటా ఇవ్వాలని ఆయన విజయవాడలోని ఏసీబీ కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై పలు దఫాలుగా విచారణ జరిపిన న్యాయస్థానం ఇటీవలే తీర్పు రిజర్వ్ చేసింది.
అయితే, తాజాగా చంద్రబాబు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. అంతేకాదు.. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, సీఐడీ అధికారుల స్వేచ్ఛ, భద్రతకు భంగం కలుగుతుందని వాదనలు వినిపించిన సీఐడీ తరఫున న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు పిటిషన్‌ను కొట్టి వేస్తూ.. కేసును ముగించింది. ఇదిలావుంటే.. చంద్రబాబు అరెస్టు వెనుక సర్కారు పెద్దల వత్తిడి ఉందని.. వారి ప్రమేయంతోనే అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారని బాబు తరఫు న్యాయవాదులు తెలిపారు.
రాజకీయంగా కక్షపూరితంగా చంద్రబాబుపై కేసు నమోదు చేశారని, దీని వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని అప్పట్లో చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ విచారణ రెండు మూడు దఫాలుగా వాయిదా పడింది. ఎట్టకేలకు తాజాగా సీఐడీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదితో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు పిటిషన్‌ను రద్దు చేసింది. అయితే.. దీనివల్ల తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీ నేతల హస్తం ఉందనేది అందరికీ తెలిసిందేనని, దీనిని నిరూపించేందుకే తాము కోర్టును ఆశ్రయించామని చెబుతున్నారు.