ఎన్నికలపై పక్కా స్కెచ్.. ఈ నలుగురికి మంత్రి పదవులు!
ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందడానికి కమలనాథులు పక్కా స్కెచ్ సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు.
లోక్ సభకు మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. తద్వారా వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సృష్టించాలని పెద్ద ఆశలే పెట్టుకుంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందడానికి కమలనాథులు పక్కా స్కెచ్ సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడం, ఓట్ల శాతాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం ముందుకు వెళ్తోందని టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగా నలుగురు కీలక నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఈ నలుగురు కూడా వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు కావడం గమనార్హం. ఈ నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో అత్యధిక సీట్లను కొల్లగొట్టాలని బీజేపీ ప్లాన్ చేసుకుందని అంటున్నారు.
బీజేపీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్న నలుగురు నేతల్లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఉన్నారని టాక్ నడుస్తోంది.
ఈ నలుగురిలో కుమారస్వామి మినహా ముగ్గురూ బీజేపీకి చెందినవారే. ఒక్క కుమారస్వామి మాత్రమే జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందినవారు.
కుమారస్వామి సహా ఈ నలుగురు మాజీ సీఎంలను ఎన్నికల ముందు కేబినెట్‌లోకి తీసుకోవాలని బీజేపీ యోచిస్తోందని అంటున్నారు. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే అనూహ్యంగా బీజేపీ.. వసుంధర రాజేకు, శివరాజ్ సింగ్ చౌహాన్ కు అవకాశం ఇవ్వలేదు. ఆ రెండు రాష్ట్రాల్లో కొత్తవారిని ముఖ్యమంత్రులుగా చేసింది. దీంతో గతంలో పలు పర్యాయాలు ముఖ్యమంత్రులుగా చేసిన వసుంధర, శివరాజ్ సింగ్ ఇద్దరూ అసంతృప్తికి గురయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా వీరిద్దరిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారని చెబుతున్నారు.
ఇక దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. శివసేనను చీల్చి బయటకు వచ్చిన ఏకనాథ్ షిండేను బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది. ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను కూడా కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించిందని సమాచారం.
ఇక దక్షిణాదిలో బీజేపీ బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం.. కర్ణాటక. ఇక్కడ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం బీజేపీకి కష్టమే. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించిందని అంటున్నారు.