మేటర్ సీరియస్... "సినిమా చూశాకే వెళ్తానని అల్లు అర్జున్ అన్నారు!"
ఈ సమయంలో అసలు ఆ రాత్రి అక్కడ ఏమి జరిగిందనే విషయాలపై ఏసీపీ రమేష్ తో పాటు చిక్కడపల్లి సీఐ రాజు నాయక్ సంచలన విషయాలు వెల్లడించారు!
"నేను గత 20 ఏళ్లుగా ఎన్నో సార్లు ఆ థియేటర్ కు వెళ్తున్నాను.. ఈసారి నేనేదో బాధ్యతా రాహిత్యంగా వెళ్లాలని, అనుమతి లేకుండా వెళ్లాలని చెబుతున్నవన్నీ తప్పుడు సమాచారాలు. నిజంగా అనుమతి లేకపోతే ఆ విషయం నాకు చెప్తారు.. నేను వెంటనే వెనక్కి వెళ్లిపోతాను..రోడ్ షో ఎక్కడా లేదు.. జరుగుతున్నది తప్పుడు ప్రచారం!"
"ఇక, థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడూ తనను ఏ పోలీసూ కలవలేదు.. నాకు ఏమీ చెప్పలేదు. కొంచెం సేపటి తర్వాత మావాళ్లు వచ్చి.. బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, దయచేసి వెళ్లిపోండి అని చెప్పారు.. దీంతో.. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి నేను, నా భార్య అంతా వెళ్లిపోయాం!"
తెలంగాణ అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అనంతరం... మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇవి. జరిగింది ప్రమాదం మాత్రమే అని.. అందులో ప్రత్యక్షంగా తన తప్పేమీ లేదని.. తప్పు జరిగిన ప్రిమిసెస్ లో తాను ఉన్నాను కాబట్టి బాధ్యత వహిస్తున్నాను అన్నట్లుగా అల్లు అర్జున్ స్పందించారని అంటున్నారు.
దీంతో... ఇప్పటికీ ఇంత జరిగాక కూడా తాను ఏ తప్పూ చేయలేదని అల్లు అర్జున్ అనడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే సీఎం స్పందించారని అన్నారు! ఈ సమయంలో అసలు ఆ రాత్రి అక్కడ ఏమి జరిగిందనే విషయాలపై ఏసీపీ రమేష్ తో పాటు చిక్కడపల్లి సీఐ రాజు నాయక్ సంచలన విషయాలు వెల్లడించారు!
అవును... సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధిచి హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ఓ వీడియోను విడుదల చేయగా.. ఇదే సమయంలో.. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీవీ ఆనంద్ తో పాటు చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సీఐ రాజు నాయక్ లు జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు.
‘సినిమా చూసిన తర్వాతే వెళ్తానని చెప్పారు’!: ఏసీపీ
ఈ సందర్భంగా స్పందించిన ఏసీపీ రమేష్ మాట్లాడుతూ... సంధ్య థియేటర్ వద్ద ఆ రాత్రి జరిగిన విషయాలు వివరించారు. ఇందులో భాగంగా... తొక్కిసలాటలో మహిళ చనిపోయారని, బాలుడు తీవ్రంగా గాయపడ్డారని.. పరిస్థితి అదుపు తప్పిందని.. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించామని అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ ని కలిసి చెప్పినట్లు తెలిపారు.
అయినప్పటికీ.. అల్లు అర్జున్ వద్దకు సదరు మేనేజర్ తమను వెళ్లనీయలేదని.. అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి, జరిగిన విషయం అల్లు అర్జున్ కి చెప్పామని అన్నారు. ఈ సందర్భంగా... "మీకు అధికారులంతా సహకరించి రూట్ క్లియర్ చేశారని.. దయచేసి ఇక్కడ నుంచి ఖాళీ చేయండి" అని చెప్పామని ఏసీపీ రమేష్ తెలిపారు.
అయినప్పటికీ... సినిమా చూసిన తర్వాతే వెళ్తానని చెప్పారని.. ఈ విషయాన్ని డీసీపీకి చెప్తే, ఆయనతో పాటు మేము లోపలికి వచ్చి 10 నిమిషాల సమయం ఇచ్చామని.. ఆ తర్వాత అల్లు అర్జున్ ని బయటకు తీసుకొచ్చామని.. ఈ క్రమంలో తాము థియేటర్ లోపలికి వెళ్లే వీడియోలు ఉన్నాయి కానీ.. అల్లు అర్జున్ తో మాట్లాడే ఫుటేజ్ కోసం ట్రై చేసినా దొరకలేదని అన్నారు.
తొక్కిసలాటలో నేను చనిపోతాననుకున్నా!: సీఐ
ఈ సందర్భంగా స్పందించిన చిక్కడపల్లి ఎస్.హెచ్.చో... సీఐ రాజు నాయక్... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... థియేటర్ యాజమాన్యం తమను అనుమతి కోరిన మాట వాస్తమేనని.. కానీ, ఒక్కటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండటం వల్ల హీరో వస్తే సమస్య అవుతుందని చెప్పామని అన్నారు. అయితే.. ఈ విషయం సదరు యాజమాన్యం హీరోకి చెప్పిందో లేదో తెలియదని అన్నారు.
ప్రధానంగా... రేవతిని బతికించడానికి ఎంతో ప్రయత్నించామని.. ఒక ప్రాణాన్ని కాపాడలేక పోయాననే బాధ గత 15 రోజులుగా తనను కలిచి వేస్తోందని అన్నారు. ఇదే సమయంలో... రెండు థియేటర్స్ ఒకే చోట ఉండటంతో క్రౌడ్ ను కంట్రోల్ చేయలేకపోయామని.. మేనెజ్మెంట్ అక్కడే ఉన్నా చుస్తూనే ఉన్నారని అన్నారు.
ఈ సమయంలోనే.. జనాలంతా గేట్లు తోసుకుంటూ జనాలు లోపలికి వచ్చారని.. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో తాను కూడా కింద పడిపోయానని.. నిజానికి ఆ తొక్కిసలాటలో తాను చనిపోతానని అనుకున్నానని.. దేవుడి దయ వల్ల ఈ రోజు ఇక్కడ ఉన్నానని సీఎం ఎమోషనల్ అయ్యారు. దీంతో.. సంధ్య థియేటర్ ఘటన వ్యవహారంలో అల్లు అర్జున్ కు సమస్యలు తప్పవా అనే చర్చ తెరపైకి వచ్చింది.