తిరుమల లడ్డూపై ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు!
కాగా తిరుమల లడ్డూ వివాదంపై ప్రముఖ సినీ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెలు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు కలిపారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ అంశం అటు అధికార కూటమి నేతల మధ్య, ఇటు ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. దీంతో సిట్ విచారణ చేస్తోంది.
కాగా తిరుమల లడ్డూ వివాదంపై ప్రముఖ సినీ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ నిజమని తేలితే బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల తరహాలో బాధ్యులకు శిక్ష పడాలన్నారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతోందని చెప్పారు.
అన్ని మతాలకు వాళ్ల ప్రార్థనా మందిరాలు ఉన్నాయని సుమన్ గుర్తు చేశారు. అన్ని చోట్ల ప్రసాదాలు చేస్తుంటారని చెప్పారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిస్తే అక్కడ ఉన్న అధికారుల బోర్డు ఏం చేస్తోందని నిలదీశారు.
నెయ్యి నాణ్యతను తనిఖీ చేసే పద్ధతి ఉంటుందని.. మరి ట్యాంకర్ నుంచి కల్తీ నెయ్యి ఎలా పాస్ అయ్యిందో తేలాలన్నారు. ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. తప్పు చేసినవారిని కఠినంగా శిక్షించాలన్నారు.
ఒకసారి అనుమానం ఒక్కసారి వచ్చాక అది అందరి మీదకు పోతుందని సుమన్ అభిప్రాయపడ్డారు. ఒక ఆఫీసులో ఒకరు తప్పు చేస్తే అందరికీ చెడ్డపేరు వస్తుందన్నారు. అలాగే ఇక్కడ కూడా అలాంటిదే జరిగిందన్నారు.
దేవుడి ప్రసాదం విషయంలో ఇలా చేయడం మహా పాపమని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య సినిమాలో తాను వేంకటేశ్వర స్వామి పాత్రను పోషించానని గుర్తు చేశారు. తిరుమలకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తారని.. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఒక సెంటిమెంట్ అని తెలిపారు. అంత పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిని వదలొద్దని ప్రభుత్వాన్ని కోరారు.
తప్పు చేసిన వారిని రెండేళ్లు జైల్లో వేసేలా బిల్లు తేవాలని సుమన్ చెప్పారు. ఈ నేరం తీవ్రవాదం కంటే ఎక్కువ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.