'జైలర్' విలన్ ను అదుపులోకి తీసుకున్న శంషాబాద్ పోలీసులు
తాజాగా అతను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా.. భద్రతా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకోవటం కలకలాన్ని రేపింది.
తెర మీద చెలరేగి నటిస్తే అవార్డులు.. రివార్డులు లభిస్తాయి. అలా అని.. రీల్ లో పండించే విలనిజాన్ని రియల్ లైఫ్ లో చూపించాలని చూస్తే.. జైలు పాలు అవుతారు. ఇప్పటికే పలువురు అలాంటి చెత్త పనులు చేసి కష్టాల్ని కొని తెచ్చుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రం ‘జైలర్’. ఈ సినిమాలో తన అద్భుతమైన విలనీ నటతో అందరిని ఆకట్టుకున్నాడు వినాయకన్. సదరు సినిమాలో అతడు పోషించిన వర్మ పాత్రతో అదరగొట్టేశాడు. రీల్ వరకు చెలరేగిపోయి నటించే అతను.. రియల్ లైఫ్ లోనూ అదే తీరును ప్రదర్శిస్తూ కేసుల్లో బుక్ అవుతున్నారు. అరెస్టు అవుతున్నాడు.
తాజాగా అతను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా.. భద్రతా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకోవటం కలకలాన్ని రేపింది. ఇంతకూ శంషాబాద్ పోలీసులు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? అన్న అంశంలోకి వెళితే.. గతంలో తాగిన మైకంలో ఎయిర్ పోర్టులోని సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను కొట్టినట్లుగా అతనిపై కేసు నమోదై ఉంది. దీంతో వారు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎయిర్ పోర్టుకు వచ్చిన అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫిర్యాదు గత ఏడాదిలో జరిగింది. అప్పట్లో కొచ్చిన్ నుంచి గోవాకు వెళ్లే క్రమంలో అతను హైదరాబాద్ లో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ సందర్భంగా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై మద్యం మత్తులో చేయి చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో అతడిపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా.. గత ఏడాది మరో ఉదంతంలో దురుసు ప్రవర్తనతో నమోదైన కేసులో అరెస్టు అయి.. జైలుకు వెళ్లి వచ్చాడు. ఇతగాడు గోవాలో సెటిల్ అయ్యాడు. తాజా ఉదంతంలో తన తప్పు ఏ మాత్రం లేదని.. తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో కూడా తెలీదని మీడియాకు చెప్పారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏం చేశారు? అన్న అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.