బీఆర్‌ఎస్‌ లోకి ప్రముఖ నటి!?

తెలంగాణలో ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని బీఆర్‌ఎస్‌ అధినేత

Update: 2023-08-19 05:42 GMT

తెలంగాణలో ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉవ్విళ్లూరుతున్నారు. తద్వారా హ్యాట్రిక్‌ సృష్టించాలని ఆరాటపడుతున్నారు. ఆయన తెలంగాణతో పాటు మహారాష్ట్రపైనా కేసీఆర్‌ దృష్టి సారించారు. మహారాష్ట్రలో రైతులు పెద్ద ఎత్తున ఉండటంతో వారి ఓట్లపై కన్నేశారు. తరచూ మహారాష్ట్రలో పర్యటిస్తూ వివిధ చిన్నా చితక పార్టీలను, నేతలను బీఆర్‌ఎస్‌ లో చేర్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీకి సినీ గ్లామర్‌ అద్దడానికి సినీ నటుల చేరికపై కేసీఆర్‌ దృష్టి సారించారని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదను బీఆర్‌ఎస్‌ లో లాగడానికి ప్రయత్నిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. జయప్రద ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇటీవల మరో ప్రముఖ సినీ నటి జయసుధ కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ పెద్ద ఎత్తున సినీ నటులను ఆకర్షిస్తోంది.

ఈ నేపథ్యంలో తమకు కూడా సినీ గ్లామర్‌ ఉంటే అది పార్టీకి మేలు చేకూరుస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్, సినీ నటి జయప్రదను బీఆర్‌ఎస్‌ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

జయప్రద పార్టీలో చేరితే ఆమెను మహారాష్ట్ర నుంచి పార్లమెంటుకు పోటీ చేయిస్తారని అంటున్నారు. జయప్రదకు దేశవ్యాప్తంగా ఉన్న పేరుప్రఖ్యాతలు, గ్లామర్‌ ను వినియోగించుకోవాలని బీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. మహారాష్ట్రలో జయప్రదను బరిలోకి దించడం ద్వారా అందరి అటెన్షన్‌ ను పొందొచ్చని ఆ పార్టీ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

కాగా 1996 టీడీపీ అనుబంధ విభాగం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా జయప్రద పనిచేశారు. అంతేకాకుండా 36 ఏళ్ల వయసులోనే టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా సైతం పనిచేశారు. ఆ తర్వాత ఆమె సమాజ్‌ వాదీ పార్టీలో చేరారు. నాటి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌ సింగ్‌ తో సన్నిహితంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ లోని రాంపూర్‌ నుంచి వరుసగా రెండుసార్లు 2004, 2009ల్లో ఎంపీగా సమాజ్‌ వాదీ పార్టీ నుంచి జయప్రద గెలుపొందారు.

ఆ తర్వాత సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్, రాంపూర్‌ సమాజ్‌ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌ తో వచ్చిన విభేదాలతో సమాజ్‌ వాదీ పార్టీకి రాజీనామా చేశారు. అమర్‌ సింగ్‌ తో కలిసి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ అసలు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ఆ పార్టీని రాష్ట్రీయ లోక్‌దళ్‌ లో విలీనం చేశారు. ఆర్‌ఎల్‌డీ తరఫున ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్‌ నుంచి 2014లో ఎంపీగా పోటీ చేసి జయప్రద ఓడిపోయారు.

తర్వాత అమర్‌ సింగ్‌ కన్నుమూయడంతో బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలోనే కొనసాగుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్‌ నుంచి పోటీ చేసి ఆజమ్‌ ఖాన్‌ చేతిలో లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

Tags:    

Similar News