ఎన్నో చూశామంటూ అదానీ సంచలన వ్యాఖ్యలు
ఏకంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రోజూ ఇదే అంశం మీద రచ్చ అవుతోంది. పార్లమెంట్ సమావేశాలు వరసగా వాయిదా పడుతున్నాయి.
భారతీయ వ్యాపార దిగ్గజం అంతర్జాతీయంగా కూడా బిగ్ షాట్ గా ఉన్న అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతం అదానీ మీద అమెరికాలో కేసులు నమోదు కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి విధితమే. ఏకంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రోజూ ఇదే అంశం మీద రచ్చ అవుతోంది. పార్లమెంట్ సమావేశాలు వరసగా వాయిదా పడుతున్నాయి.
అంతలా దేశంలో రాజకీయ దుమారం రేపుతున్న ఈ అంశం మీద మొదటిసారిగా గౌతం అంబానీ స్పందించారు. ఆయన తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగిన జెమ్ అండ్ జ్యూయలరీ అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలే చేశారు. అమెరికాలో తన మీద కేసులు పెట్టడాన్ని ఆయన దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కేసులు అదానీ గ్రూప్ సంస్థలకు కొత్త ఏమీ కాదని అన్నారు. ఎన్నో ఇప్పటిదాకా చూసామని కూడా మాట్లాడారు. తాము ఈ తరహా కేసులను ఎన్నో ఎదుర్కొన్నామని కూడా చెప్పుకొచ్చారు.
ఏదైనా సమస్య వచ్చినపుడే మరింత బలం అవుతామని ఆయన అంటూ ఇలాంటి సమస్యలు కానీ జరిగే దాడులు కానీ తమను మరింత దృఢంగా మార్చుతాయని గౌతమ్ అదానీ పేర్కొనడం విశేషం. ఇక అదానీ గ్రూప్ సంస్థలకు ఎదురయ్యే ప్రతి ఇబ్బంది కానీ అవరోధాలు కానీ తమకు సక్సెస్ రూట్ గా మారుతాయని అన్నారు. అంటే ఈ సవాళ్ళ నుంచే తమ విజయం సాగుతుందని అదానీ చెప్పారన్న మాట.
ఇదిలా ఉంటే భారత్ లో సోలార్ ఎనర్జీ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు లంచాలు ఇచ్చినట్టు అదానీ గ్రూప్ సంస్థలపై ఇటీవల ఆరోపణలు రావడం దాని మీద ఏపీలోనూ తీవ్ర స్థాయిలో రాజకీయ రచ్చ సాగుతున్నది కూడా విధితమే. అయితే దీని మీద అదానీ తమకు ఇలాంటివి మామూలే అని లైట్ తీసుకోవడం పట్ల కూడా చర్చ సాగుతోంది.
మరో వైపు లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అదానీ మీద చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో అయితే జగన్ అమెరికా వెళ్లాల్సి ఉంటుందని కూడా కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయం ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో అసలు కేసు ఏమిటి పూర్వపరాలు ఏమిటి అన్నది ఎవరూ వివరించడం లేదు అంటున్నారు. అదానీ అయితే తమకు కొత్త కాదంటూ దీనికి తనదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చారు.
ఇక పార్లమెంట్ సమావేశాలు రోజుల తరబడి వాయిదా అవుతున్నాయి. అదానీ ఇష్యూ విషయంలో మాత్రం దేశంలో రాజకీయ సమరమే సాగుతోంది. మరి దీనికి ముగింపు ఉంటుందా అన్నదే ప్రశ్నగా ఉంది. అదానీ దీని మీద మాట్లాడుతూ ఇలాంటివి మామూలే అనడం తో ఈ సీరియస్ ఇష్యూని పక్కన పెట్టి ప్రతిపక్షాలు వేరే దాని మీద ఫోకస్ పెడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.