రోజులో అదానీ షేర్ల పతనంలో ఎంత తేడానంటే?

ఈ క్రమంలో గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై అమెరికాలో సివిల్ - క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

Update: 2024-11-23 04:44 GMT

ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. దేశీయంగా అత్యంత పవర్ ఫుల్ కార్పొరేట్ పెద్ద మనిషి అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదు కావటం తెలిసింతే. ఇంతకూ గౌతమ్ అదానీ చేసిన తప్పేంటి? దానికి అమెరికా కోర్టులు ఏం చెబుతున్నాయి? దీని కారణం ఏమిటి? ఈ మొత్తం ఎపిసోడ్ ను సింపుల్ గా, ఒక్క లైన్ లో చెప్పాలంటే.. ‘‘భారత్ లో లంచాలు ఇచ్చేందుకు అవసరమైన అమెరికా డాలర్లను ఆ దేశ పెట్టుబడిదార్ల నుంచి సమీకరించారు’’ అన్నదే ఆరోపణ.

ఈ క్రమంలో గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై అమెరికాలో సివిల్ - క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిపై అరెస్టు వారెంట్లు జారీ కావటం.. అమెరికాకు గౌతమ్ అదానీ అండ్ టీంను అప్పగించాలని కోరే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజా పరిణామాలతో గురువారం స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపునకు చెందిన షేర్లు ఎంత భారీగా నష్టపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సినఅ వసరం లేదు.

తాజా ఆరోపణల నేపథ్యంలో గురువారం ఒక్కరోజులో అదానీ గ్రూపునకు చెందిన షేర్ల మార్కెట్ విలువ రూ.2.24 లక్షల కోట్ల మేర కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. గురువారం అదానీ గ్రూపులోని వివిధ కంపెనీ షేర్ల ధరలు ఎంత భారీగా పతనం అయ్యాయన్నది చూస్తే..

కంపెనీ పేరు షేరు పతనం (శాతం)

అదానీ ఎంటర్ ప్రైజస్ 23.44%

అదానీ గ్రీన్ ఎనర్జీ 18.95%

అదానీ పవర్ 9.62%

అదానీ పోర్ట్స్ 13.23%

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20%

అదానీ విల్మర్ లిమిటెడ్ 10%

అదానీ టోటల్ గ్యాస్ 10.38%

ఏసీసీ లిమిటెడ్ 7.99%

అంబుజా సిమెంట్స్ 12.66%

అంతే.. అదానీ మీద కోర్టులో కేసు నమోదైందన్నంతనే మార్కెట్ లో ఆ సంస్థకు చెందిన షేర్లలో అత్యధికంగా అదానీ ఎంటర్ ప్రైజెస్ 23.44 శాతం నష్టపోతే.. కనిష్ఠంగా ఏసీసీ లిమిటెడ్ 7.99 శాతానికే పరిమితమైంది. రోజు వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాలు.. శుక్రవారం ఉదయానికే అమెరికా అధ్యక్ష భవనం (వైట్ హౌస్) నుంచి వెలువడిన స్పందన.. అదానీ ఇష్యూలో దూకుడు నిర్ణయాలు.. కఠినపూరితమైన చర్యలు లాంటివి ఉండే అవకాశాలు తక్కువన్న అభిప్రాయం వ్యక్తమైంది. అదే సెంటిమెంట్ ను ప్రతికూలత ఖాయమన్న అభిప్రాయానికి భిన్నంగా.. రోజు వ్యవధిలోనే అదానీ షేర్ల కదలికల్లో మార్పులు చోటు చేసుకోవటం కనిపిస్తుంది.

గురువారం తీవ్రంగా నష్టపోయిన అదానీ గ్రూపు షేర్లు.. శుక్రవారం నాటికి పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయి. గురువారం 22.61 శాతం అదానీ షేర్లలో నష్టం వాటిల్లగా.. శుక్రవారం పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. శుక్రవారం అదానీ గ్రూపులోని ఆరు కంపెనీల షేర్లు కాస్తంత కోలుకోగా.. నాలుగు కంపెనీలు మాత్రమే నష్టాల్ని నమోదు చేశాయి.

లాభాలు నమోదు చేసిన అదానీ సంస్థలు చూస్తే..

కంపెనీ పేరు లాభం (శాతం ఎంతంటే?)

అంబుజా సిమెంట్స్ 3.50%

ఏసీసీ 3.17%

అదానీ ఎంటర్ ప్రైజెస్ 2.16%

అదానీ పోర్ట్స్ 2.05%

అదానీ టోటల్ గ్యాస్ 1.18%

ఎన్ డీటీవీ 0.65%

గురువారం స్థాయిలో కాకున్నా శుక్రవారం అదానీ షేర్లలో నష్టాల బాట పట్టిన కంపెనీల వివరాల్లోకి వెళితే.. అదానీ గ్రీన్ ఎనర్జీ 8.20 శాతం నష్టపోగా.. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 6.92%, అదానీ పవర్ 3.23%, అదానీ విల్మర్ 0.73 శాతం చొప్పున షేర్ల ధరలు క్షీణించిన పరిస్థితి. మొత్తంగా చూస్తే.. రోజులో అదానీ గ్రూపులోని ఎక్కువ కంపెనీల సెంటిమెంట్ నెగిటివ్ నుంచి పాజిటివ్ దిశగా ప్రయాణించిన వైనం భయాందోళనల్ని కాస్తంత తగ్గించేలా చేసిందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఇప్పుడో పెద్ద సందేహం మార్కెట్ లో నడుస్తోంది.

అమెరికాలో నమోదైన కేసు నేపథ్యంలో అదానీ గ్రూప్ విషయంలో సెబీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అదెలా స్పందించనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. శుక్రవారం వరకు అదానీ గ్రూపునకు సంబంధించిన ఏ అంశంపైనా స్పందించింది లేదు. అయితే.. స్పందన లేనంత మాత్రాన.. సెబీ దీన్ని వదిలేస్తుందని భావిస్తే తప్పులో కాలేసినట్లుగా చెప్పాలి. ఒకవేళ సెబీ విచారణలో అదానీ గ్రూపు తప్పులున్నట్లు తేలితే చర్యలు ఖాయంగా ఉంటాయని చెబుతున్నారు. ఏమైనా.. అందుకు మరికాస్త సమయం పట్టే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News