అంబానీ.. అదానీలకు '2023' ఎలా ఉంది?
కాలగర్భంలో మరో ఏడాది ముగియనుంది. మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం
కాలగర్భంలో మరో ఏడాది ముగియనుంది. మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. నిజానికి ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం నుంచే నూతన సంవత్సర సంబరాలు మొదలు కానున్నాయి. మనకంటే ముందు ఉండే దేశాల్లో మన కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేయనున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ క్యాలెండర్ ఇయర్ లో దేశంలోనే అతి సంపన్నులైన ఇద్దరికి ఈ ఏడాది ఎలా ఉంది? అన్నది ఆసక్తికర అంశం.
దేశీయ కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీలకు 2023 ఎలా నడిచింది. వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? లాంటి విషయాల్లోకి వెళ్లినప్పుడు.. ఈ ఏడాది అంబానీ తన సత్తా చాటితే.. అదానీకి మాత్రం ఇటీవల కాలంలో ఎదురుకాని అగ్నిపరీక్షలు చాలానే ఎదురయ్యాయని చెప్పాలి.
అయితే.. ఈ ఇద్దరు కాలపరీక్షను సమర్థంగా ఎదుర్కోవటం గమనార్హం. రేసులో అంబానీ తనకు తిరుగులేదన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తే.. అదానీ సైతం తానేం తక్కువ తినలేదన్నట్లుగా నిరూపించుకున్నారు. అయితే. అంబానీ తర్వాతే తనదే దూకుడు అన్న విషయాన్ని గౌతమ్ అదానీ మరోసారి ఫ్రూవ్ చేశారు.
బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ముకేశ్ అంబానీ ఈ ఏడాది అత్యధికంగా 9.98 బిలియన్ డాలర్ల సంపదను సమకూర్చుకున్నారు. దీంతో ఆయన ఆస్తి మొత్తం విలువ 97.1 బిలియన్లుగా లెక్కేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. అంబానీ సంపాదన పెరిగేందుకు రిలయన్స్ ఇండస్ట్రీ.. జియో ఫైనాన్షియల్ సర్వీస్ షేర్లు రాణించటంగా పేర్కొన్నారు.
2023 జులై 20న ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీస్ ను విడదీశారు. స్టాక్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత దీని లిస్టింగ్ కు అంచనాలకు మించి స్పందన వచ్చింది.దీంతో.. రిలయన్స్ ఆస్తులు మరింతగా పెరిగాయి. ఇక.. అదానీ విషయానికి వస్తే 2023 ఆయన స్పీడ్ కు బ్రేకులు వేసిన ఏడాదిగా చెప్పాలి. కాలపరీక్ష అన్న మాట ఆయనకు అనుభవంలోకి వచ్చింది.
ఆయన దూకుడుకు సడన్ బ్రేక్ వేసింది హిండెన్ బర్గ్ రిపోర్టు. అయితే..ఈ నివేదిక తప్పుడన్న విషయం తేలినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.హిండెన్ బర్గ్ రిపోర్టు దెబ్బకు అదానీ తీవ్రమైన ప్రతికూల పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆయన 2023లో 37.3 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ 83.2 బిలియన్ డాలర్లతో దేశంలోనే రెండో సంపన్నుడిగా కంటిన్యూ అవుతున్నారు. ఈ ఏడాది జనవరిలో అత్యధిక (21 బిలియన్ డాలర్లు) సంపదను కోల్పోయారు. అయినప్పటికీ తట్టుకొని నిలవటం.. రెండోస్థానంలో కంటిన్యూ కావటం అదానీకి మాత్రమే సాధ్యమన్న మాట మార్కెట్ వర్గాలు చెబుతుండటం గమనార్హం.