వైసీపీ డెయిరీ అకౌంట్ క్లోజ్

విశాఖలో వైసీపీకి కీలక నేతలు వరసగా గుడ్ బై చెబుతున్నారు. వారంతా పార్టీని సైలెంట్ గా వీడి పోతున్నారు.

Update: 2024-12-21 03:26 GMT

విశాఖలో వైసీపీకి కీలక నేతలు వరసగా గుడ్ బై చెబుతున్నారు. వారంతా పార్టీని సైలెంట్ గా వీడి పోతున్నారు. వైసీపీ ఘోర ఓటమి తరువాత పార్టీ భవిష్యత్తు మీద ఒక అంచనాకు వచ్చి ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఇప్పటికే పార్టీని వదిలేశారు. గత వారం మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఫ్యాన్ నీడన ఉక్క బోత అంటూ తప్పుకున్నారు.

సరిగ్గా వారం తిరగకముందే విశాఖ డెయిరీ చైర్మన్ గా అంగబలం అర్ధబలం కలిగిన నేతగా ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఆయనతో పాటు విశాఖ డెయిరీకి చెందిన డైరెక్టర్లు కూడా రాజీనామా చేయడంతో విశాఖ డెయిరీ టీడీపీ పరం అవుతుందని అంటున్నారు.

తొందరలోనే ఆడారి ఆనంద్ కుమార్ టీడీపీలో చేరుతారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఆనంద్ కుటుంబానిది టీడీపీయే. ఆయన తండ్రి ఆడారి తులసీరావు దశాబ్దాల పాటు పార్టీకి సేవలు అందించారు. ఆయన ఏనాడూ పార్టీని మారలేదు.

ఆనంద్ రాజకీయ అరంగేట్రం టీడీపీ నుంచే జరిగింది. ఆయనకు అనకాపల్లి నుంచి ఎంపీగా టికెట్ ఇచ్చి చంద్రబాబు ప్రోత్సహించారు. అయితే వైసీపీ వేవ్ లో ఆయన ఓటమి పాలు అయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అందులో చేరారు. అయితే 2024 ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి పాలు కావడంతో పాటు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన సైకిలెక్కుతారని ప్రచారం జోరందుకుంది.

దానిని తగినట్లుగా చాలా కాలం సైలెంట్ గా ఉన్న ఆడారి ఇపుడు వైసీపీకి షాక్ ఇచ్చేశారు అని అంటున్నరు. బీసీలలో బలమైన నేతగా ఉన్న ఆడారి రాజీనామా వైసీపీకి రాజకీయగా సామాజిక సమీకరణల పరంగా కూడా నష్టమే అని అంటున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీలో ఉన్న నాయకులు కూడా మౌనంగా నెట్టుకుని వస్తున్నారు. ఒక్కో రాజీనామా చాలా మందిలో కొత్త ఆలోచనలను కలుగచేస్తోంది అని అంటున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలలో 2024 ఎన్నికల్లో 34 అసెంబ్లీ సీట్లకు గానూ కేవలం రెండంటే రెండు సీట్లూ అది ఏజెన్సీలోనే వైసీపీకి దక్కాయి.

ఈ రోజున చూస్తే గట్టి నేతలు లేక పార్టీ వట్టిపోతోంది అన్న భావన అయితే క్యాడర్ లో ఉంది. వైసీపీలో ఒక రకమైన నిరాశ కూడా తాండవిస్తోంది. విశాఖ డెయిరీ చైర్మన్ కుటుంబానికి విశాఖ రూరల్ జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాలలో బలం ఉంది. దాంతో ఆయన గుడ్ బై చెప్పడం పైన చర్చ సాగుతోంది. వైసీపీలో ఒక్కో వికెట్ పడిపోతూంటే రానున్న రోజులలో ఎవరు వంతు అని క్యాడర్ లో చర్చ అయితే సాగుతోంది. ఈ జంపింగులను ఆపే పరిస్థితి మెకానిజం అయితే వైసీపీలో లేదని అంటున్నారు.

Tags:    

Similar News