పెళ్లిళ్లలో ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే నిషేధం - సంప్రదాయానికి పట్టం!

అయితే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన శ్యాం నాయక్ తండా వాసులు తమ సంప్రదాయాలను కాపాడుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2025-02-28 06:30 GMT

పెళ్లి అనేది రెండు మనసుల మధ్యన మాత్రమే కాదు.. రెండు కుటుంబాల మధ్యన కూడ అనుబంధాన్ని పెంచే పవిత్రమైన బంధం. అయితే ఆధునికత పెరిగిన కొద్దీ వివాహ వేడుకల్లో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎక్కువైంది. ఫోటోషూట్లు, డీజే డాన్సులు, హల్దీ వంటి పాశ్చాత్య కార్యక్రమాలు పెళ్లిళ్లలో విస్తృతంగా చోటు చేసుకున్నాయి. అయితే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన శ్యాం నాయక్ తండా వాసులు తమ సంప్రదాయాలను కాపాడుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

- సంస్కృతిని పరిరక్షించేందుకు కీలక నిర్ణయం

శివరాత్రి సందర్భంగా గ్రామస్థులు సమావేశమై, తమ ఆచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ వివాహ వేడుకల్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. అందులో ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే మ్యూజిక్, హల్దీ వంటి పాశ్చాత్య సంస్కృతికి చెందిన కార్యక్రమాలను పూర్తిగా నిషేధించారు. ఈ నిర్ణయం గ్రామ పెద్దలు, యువత, మహిళలు ఏకగ్రీవంగా తీసుకోవడం విశేషం.

- సాంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి వేడుకలు

శ్యాం నాయక్ తండా వాసులు తమ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ, పెళ్లి వేడుకలను సంప్రదాయరీతిలో జరుపుకోవాలని నిర్ణయించారు. వధువు, వరుడు తమ కుటుంబ పెద్దల ఆశీస్సులతో, సంప్రదాయ దుస్తుల్లో, గ్రామ పెద్దల సమక్షంలో వివాహ బంధాన్ని గౌరవంగా కొనసాగించాలని తీర్మానించారు. ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యత ఇస్తూ, సంగీత బంద్ కాకుండా సంప్రదాయ బృందాలతో పెళ్లి వేడుకలు జరపాలని నిర్ణయించారు.

- తరం మారినా, సంప్రదాయం మారకూడదు

ఆధునికత పెరుగుతున్నా, మాతృసంస్కృతిని మరిచిపోవద్దని గ్రామస్థులు నొక్కిచెప్పారు. ఈ నిర్ణయం తండా యువతకు కూడా నచ్చింది. ఈ విధంగా తరం మారినా, తమ పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగిస్తూ, కొత్త తరం పిల్లలకు సాంప్రదాయ విలువలను నేర్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు తెలిపారు.

- సాంప్రదాయాలకు ప్రాధాన్యం

ఈ నిర్ణయం ద్వారా పెళ్లిళ్లు అంత పాశ్చాత్యబద్దంగా కాకుండా, సాంప్రదాయబద్ధంగా జరిపే అవకాశం కలుగుతుంది. డీజే మ్యూజిక్ వల్ల కలిగే శబ్ద కాలుష్యం తగ్గటమే కాకుండా, ఆర్థిక వ్యయం కూడా తగ్గుతుందని గ్రామస్థులు పేర్కొన్నారు.

సంస్కృతి కాపాడుకోవాలన్న సంకల్పంతో ఆదిలాబాద్ జిల్లా శ్యాం నాయక్ తండా వాసుల నిర్ణయం, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవనుంది.

Tags:    

Similar News