బోల్తా కొడుతున్న విజయనగరం మహారాణి
గత ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పెద్ద కుమార్తె అదితి గజపతిరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.;

విజయనగరం రాజ వంశస్థురాలు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వారసురాలు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారా? పాలిటిక్స్ లో ఏవి పాలు..? ఏవీ నీళ్లో..? యువరాణి తెలుసుకోలేకపోతున్నారా? ఒకప్పుడు టీడీపీ వైభవ చిహ్నంగా నిలిచిన అశోక్ బంగ్లా ఇప్పుడు సెటిల్మెంట్లకు, దందాలకు అడ్డాగా మారిపోతుందనే విమర్శల వెనుక నిజమెంత? పద్ధతికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పే రాజావారి బంగ్లాలో ఘోరాలు జరుగుతుంటే అశోక్ అనుచరులు, శిష్యులు నిస్సహాయులుగా మిగిలితున్నారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఎంతో క్రమశిక్షణ పాటించే విజయనగరం గజపతులు ఇప్పుడు విమర్శలకు గురవడానికి కారణాలేంటన్నదే ఆసక్తి రేపుతోంది.
గత ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పెద్ద కుమార్తె అదితి గజపతిరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అదితి అప్పట్లో అపజయమే ఎదుర్కొన్నారు. అయితే పట్టు వీడకుండా, ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో 2024 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2019-24 మధ్య కోట నుంచి బయటకు వచ్చిన యువరాణి.. విజయనగరం నడివీధుల్లో తిరుగుతూ ప్రజాభిమానం పొందారు. దీంతో తన ప్రత్యర్థి, సీనియర్ నేత కోలగట్లకు మట్టి కరిపించారు. రాజరికం, తాత తండ్రుల నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నా, అదితి స్వతహాగానే రాణించారని చెబుతుంటారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక అదితి ఎక్కువగా తన అనుచరులపై ఆధారపడుతుండటం అనేక వివాదాలకు కారణమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో దూకుడు చూపిన అదితి గజపతిరాజు.. ప్రస్తుతం తాను పరిమితంగా కనిపిస్తూ తన అనుచరులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారంటున్నారు. దీంతో తన తండ్రి నుంచి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ల కన్నా, ఎమ్మెల్యే అదితికి క్లోజు గా ఉంటున్న కొందరు నాయకులు స్పీడు పెంచేశారంటున్నారు. దందాలు, సెటిల్మెంట్లతో చెలరేగిపోతూ అశోక్ బంగ్లాపై వేలెత్తి చూపే పరిస్థితి తీసుకువచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై యువరాణికి అవగాహన ఉందో? లేదో? గానీ జరుగుతున్న పొరపాట్లను అదితి దృష్టికి తీసుకువచ్చేందుకు కూడా టీడీపీ కార్యకర్తలు భయపడుతున్నారంటున్నారు. తాము చెబితే ఎమ్మెల్యే ఎలా అర్థం చేసుకుంటారోననే భయమే ఎక్కువమందిలో కనిపిస్తోందంటున్నారు.
విజయనగరంలో టీడీపీకి పార్టీ కార్యాలయం అంటూ ఎక్కడా లేదు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లానే జిల్లా పార్టీ కార్యాలయంగా వినియోగిస్తుంటారు. విజయనగరం నియోజకవర్గ రాజకీయాలు కూడా అక్కడ నుంచే కొనసాగుతాయి. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అనుచరుల తీరు వల్ల బంగ్లాపై విమర్శలు వినిపిస్తున్నాయంటున్నారు. ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరురాలిగా వ్యవహరిస్తున్న ఓ మహిళా నేత నగరంలో హల్ చల్ చేస్తున్నారంటున్నారు. తానే ఎమ్మెల్యే అన్నట్లు ఆమె రాజ దర్బార్ నిర్వహిస్తుండటం, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెద్దరికం చెలాయించడం వంటివి విమర్శలకు గురవుతున్నాయి. గతంలో ఆమె తీరుపై వీడియోలు వైరల్ అవ్వడంతో కాస్త తగ్గారని, ఇప్పుడు మళ్లీ జోరు చూపిస్తున్నారని అంటున్నారు. దీంతో యువరాణి అదితి గజపతిరాజు ఇమేజ్ డామేజ్ అవుతోందని టాక్ నడుస్తోంది. పార్టీ సీనియర్స్, ప్రధానంగా తన తండ్రి అశోక్ గజపతిరాజు అనుచరులుగా ముద్రపడిన వారిని యువరాణి లెక్కచేయకపోవడం కూడా అసంతృప్తికి దారితీస్తోందంటున్నారు. దీంతో ఈ పరిస్థితులను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేకు కార్యకర్తలు సూచిస్తున్నారు. తండ్రి అశోక్ గజపతిలా సుదీర్ఘంగా రాజకీయ ప్రస్థానం కొనసాగించాలంటే ఎమ్మెల్యే అదితి తండ్రి నుంచి చాలా నేర్చుకోవాల్సివుందని అంటున్నారు.