నలుగురిని కాపాడి.. చివరకు తాను చనిపోయాడు

వరదల్లో మానవత్వం చాటిన ఓ యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. నగరానికి చెందిన చంద్రశేఖర్ (32) సింగ్‌నగర్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో పనిచేస్తుండగా ఒక్కసారిగా వరద పోటెత్తింది.

Update: 2024-09-05 08:34 GMT

విజయవాడ సిటీ ఇంకా విషాదం నుంచి కోలుకోలేదు. అక్కడ వరదలు మిగిల్చిన విషాదం అంతాఇంతా కాదు. మరోవైపు.. అధికారులు చెబుతున్న లెక్కలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 18 మంది చనిపోయారని పాలకులు ప్రకటించినా.. గంటల వ్యవధిలోనే 12 మృతదేహాలు బయటపడడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకొస్తున్నారు. వరద నుంచి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో చాలా మంది అందులో పడి కొట్టుకుపోయినట్లుగా చెబుతున్నారు.

అలా.. బెజవాడలో పదుల సంఖ్యలో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. వారిలో ఒక్కొక్కరిది ఒక్కో దీనగాధ. కాగా.. ఆ విషాదాలు రోజుకొకటి చొప్పున అన్నట్లు వినిపిస్తున్నాయి. అలాంటి విషాద ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.

వరదల్లో మానవత్వం చాటిన ఓ యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. నగరానికి చెందిన చంద్రశేఖర్ (32) సింగ్‌నగర్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో పనిచేస్తుండగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. అతనితోపాటు ఇద్దరు సోదరులు, మరో ఇద్దరు ఉన్నారు. అందరూ కలిసి డెయిరీలో పనులు చేస్తున్నారు. చంద్రశేఖర్ వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు.

అందులో భాగంగానే వారిని షెడ్డు పైకప్పు మీదకు చేర్చి వారికి ప్రాణాలు మిగిల్చాడు. అలాగే.. ఫామ్‌లోని పశువుల తాళ్లను సైతం వదిలేశాడు. అయితే.. చివరగా తాను సైతం షెడ్డు పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కాలు జారి వరదలో పడి కొట్టుకుపోయాడు. చంద్రశేఖర్‌కు భార్య ఉండగా.. ఇప్పుడు ఆమె 8 నెలల గర్భిణి. దీంతో ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Tags:    

Similar News