'ఏఐ' సంచలనం... కేరళలో 19 ఏళ్ల క్రితం నాటి మర్డర్ కేస్ ఛేదించారు!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో బలంగా వినిపిస్తోన్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో బలంగా వినిపిస్తోన్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సంగతి తెలిసిందే. దీని వల్ల ఉద్యోగాలు తగ్గుతాయని.. ప్రపంచ వ్యాప్తంగా సమస్యలు పెరుగుతాయని ఒక పక్క వినిపిస్తుంటే.. ఏఐతో అద్భుతాలు సృష్టించొచ్చని మరికొంతమంది వాదిస్తున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తాజాగా కేరళలో అద్భుతం జరిగిందనే చెప్పాలి. సుమారు 19 ఏళ్ల క్రితం నాటి మర్డర్ కేసును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పోలీసులు ఛేదించారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో.. అసలు ఏమిటా కేసు.. ఈ కేసు ఛేదనలో ఏఐ ఎలా ఉపయోగపడింది అనే విషయాలు ఇప్పుడు చూద్దామ్..!
19 ఏళ్ల క్రితం ఆ రోజు...!:
2006 ఫిబ్రవరి 10 సాయంత్రం 6 గంటల ప్రాంతంలో.. కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని అంచల్ లోని స్థానిక పంచాయతీ కార్యలయంలో పనిచేసే శాంతమ్మ అప్పుడే ఇంటికొచ్చి లోపలికి వెళ్లారు. ఆ సమయానికి లోపల ఉన్న దృశ్యం చూసి నిర్ఘాతపోయారు. ఆ గది మొత్తం రక్తసిక్తమై ఉంది. ఏమి జరిగిందో ఒక్క నిమిషం అర్ధం కాలేదు.
తేరుకుని చూసేసరికి.. ఆమె ఒక్కగానొక్క కుమార్తె రంజని.. ఆమె 17 రోజుల కవల పసి కందులు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. ఆ ముగ్గురునీ ఎవరో అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేశారు. ఈ సమయంలో... విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సమయంలో అక్కడ లభించిన టూవీలర్ వెహికల్ ఆధారంగా ఆర్మీలో పనిచేస్తున్న రాజేష్, దివిల్ లు ఈ హత్యలకు పాల్పడి ఉండోచ్చని ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. దీంతో... వారి గురించి తీవ్రంగా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇలా ఎంతగా గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. దీంతో.. ఈ కేసును 4 ఏళ్ల తర్వాత 2010లో సీబీఐకి బదిలీ చేశారు.
అయినప్పటికీ వారి ఆచూకీ దొరకలేదు. ఆ ఘటన జరిగిన ఇప్పటికి సుమారు 19 ఏళ్లయ్యింది. ఈ సమయంలో.. నేర పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత కీలకంగా మారిన వేళ ఆ కేసును దీని సాయంతో పరిష్కరించాలనే ఆలోచన చేశారు దర్యాప్తు అధికారులు. దీంతో.. మరోసారి రంగంలోకి దిగారు.
ఈ సమయంలో వారి దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం అయిన రాజేష్ ఫోటోను బయటకు తీశారు. ఈ సమయంలో అతడు ఇప్పుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని ఏఐ ద్వారా తెలుసుకున్నారు. 19 ఏళ్ల తర్వాత రాజేష్ ఎలా ఉంటాడో ఏఐ చూపించింది. దీంతో ఆ ఫోటోను పట్టుకుని సోషల్ మీడియాలో ఏఐ సాయంతో జల్లెడపట్టడం ప్రారంభించారు.
ఈ క్రమంలో... ఓ పెళ్లి వేడుకలోని ఫోటోల్లో ఉన్న వ్యక్తి 19 ఏళ్ల నాటి రాజేష్ ఫోటోతో సుమారు 90 శాతం మేర మ్యాచ్ అయ్యాడు. దీంతో.. వెంటనే అతడి వివరాలు సేకరించిన దర్యాప్తు అధికారులు పుదుచ్చేరికి వెళ్లి తొలుత రాజేష్ ను.. అనంతరం అతడి ద్వారా దివిల్ ను గుర్తించి అరెస్ట్ చేశారు.
ఆ ముగ్గుర్ని అంత కిరాతకంగా ఎందుకు చంపారు?:
రంజనీ ఆమె 17 ఏళ్ల కవల పిల్లలను గొంతు కోసి అంత కిరాతకంగా ఎందుకు చంపారో తెలియలంటే.. అసలు రంజన్ కి దివిల్ కి ఉన్న బంధం తెలియాలి. అదేమిటనేది ఇప్పుడు చూద్దామ్..!
ఒకే గ్రామానికి చెందిన రంజని – దివిల్ లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి కాకుండానే ఆమె గర్భవతి అయ్యింది. అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు దివిల్. ఈ క్రమంలో 2006 జనవరిలో ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం తనను మోసం చేసిన దివిల్ పై న్యాయపోరాటానికి సిద్ధమైంది.
ఈ సమయంలో దివిల్ అత్యంత కృరమైన ఆలోచన చేశాడు. అందులో భాగంగా.. ఆమెను ఇద్దరు పసికందులను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. దీనికోసం ఆర్మీలో తన కొలీగ్ అయిన రాజేష్ సహాయం కోరాడు. ఈ సమయంలో రంజని వద్దకు వచ్చిన రాజేష్.. తనను అనిల్ కుమార్ లా పరిచయం చేసుకుని, దివిల్ పై చేస్తోన్న పోరాటంలో సహకరిస్తానని నమ్మబలికాడు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 10న రంజని ఇంటికి వచ్చిన రాజేష్ అలియాస్ అనిల్.. పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ తీసుకురావాలని చెప్పి శాంతమ్మను పంచాయతీకి పంపించాడు. ఆమె అలా వెళ్లిన వెంటనే రంజని గొంతు కోసి చంపేశాడు. తర్వాత పసికందులను అలాగే చంపి అక్కడ నుంచి జారుకున్నాడు. అనంతరం ఆర్మీ బేస్ కు వెళ్లిపోయారు.